స్మార్ట్ ఫోన్ల సంస్థ ‘షియామీ’ నుంచి ఇక రుణ పరపతి

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 11:33 AM IST
Highlights

ఒక అడుగు తర్వాత మరొక అడుగు వేయాలన్నది నీతి. దాన్ని చైనా మొబైల్ ఫోన్ల దిగ్గజం షియామీ అక్షరాల పాఠిస్తున్నది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఎల్ఈడీ టీవీల తయారీ విక్రయాల్లో సంచలనాలు నెలకొల్పుతున్న షియామీ.. త్వరలో భారత దేశంలో ఆర్థిక సేవల సంస్థగా ప్రస్తానాన్ని ప్రారంభించనున్నది.

న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేజర్ షామీ భారతదేశ మార్కెట్లో సంచలనాలు స్రుష్టిస్తోంది. క్రమంగా తన వ్యాపారాన్ని ఇతర రంగాలకూ విస్తరణ దిశగా అడుగులేస్తున్నది. తొలుత చౌక స్మార్ట్‌ఫోన్లతో మొదలు పెట్టి ప్రస్తుతం స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలను సైతం విక్రయిస్తున్న ఈ సంస్థ.. తాజాగా ఫైనాన్స్‌ వ్యాపారంలోకీ అడుగు పెట్టాలని తలపోస్తున్నది. ఆ మేరకు షామీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండియా పేరుతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఏర్పాటు చేయాలని తలపోసినట్లు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఇందుకోసం ఎన్బీఎఫ్సీ లైసెన్సు కోసం సంస్థ త్వరలోనే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోనున్నది. తద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్రుహోపకరణాలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, వెహికల్స్, ఫర్నీచర్, ఆఫీసు పరికరాలు తదితరాల కొనుగోళ్లకు రుణాలు మంజూరు చేయనున్నది. 
ఇంతకుముందు మే నెలలో ఆర్థిక రుణాల సంస్థ క్రేజీబీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోనే చైనాలో ‘మీ క్రెడిట్’ పేరుతో ఆర్థిక సేవలందిస్తున్న షియామీ.. భారతదేశంలో సూక్ష్మస్థాయి రుణాల మంజూరు సంస్థగా ఆర్థిక సేవలు అందజేయనున్నది. 

కొన్నేళ్లుగా మొబైల్ ఫోన్ల విక్రయంలో టాప్ లీడర్‌గా నిలిచిన శ్యామ్ సంగ్.. షియామీ రంగ ప్రవేశంతో వెనుకబడింది. తాజాగా స్మార్ట్ టీవీల విభాగంలోకి విస్తరణ దిశగా అడుగులేస్తున్నది. అందులో భాగంగా డిక్సాన్ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ఉత్పాదక సంస్థ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నది. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక యూనిట్ నిర్మాణ పనులు సాగుతుండగా సుమారు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. భవిష్యత్‌లో మరికొన్ని రంగాల్లోకి విస్తరించనున్నట్లు తన మనస్సులో మాటను బయటపెట్టింది. 

తన సేవల విస్తరణ కోసం షియామీ గత జూలైలో ఐపీవో ద్వారా నిధులు సేకరించింది. ప్రత్యేకించి ఇంటర్నెట్ సర్వీసుల్లో ఎకో సిస్టమ్ నిర్మాణానికి, ఇండియా స్పెసిపిక్ ఐఓటీ పరికరాల తయారీకి స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టినట్లు షియామీ భారత్ అధిపతి మనుకూమార్ జైన్ గత ఆగస్టులో ప్రకటించారు. ఆర్ అండ్ డీ విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి ఐపీఓ ద్వారా 4.5 బిలియన్ల డాలర్లు (30 శాతం) సేకరించామన్నారు. 30 శాతం పెట్టుబడులు విదేశాల్లో విస్తరణకు, ఇతర ఖర్చులకు 10 శాతం నిధులు సేకరించినట్లు మనుకుమార్ జైన్ వివరించారు. ఇప్పటికే భారతదేశ వాణిజ్యంలో లాభాలు గడిస్తున్నందున అదనపు పెట్టుబడులు పెట్టనవసరం లేదు.
 

click me!