సిబ్బందికి‘జియో’ షాక్: 5000 కొలువులు హాంఫట్!

By rajesh yFirst Published May 30, 2019, 11:24 AM IST
Highlights

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మూడేళ్ల క్రితం టెలికం రంగంలో ప్రవేశించి సంచలనాలు నెలకొల్పారు. ప్రస్తుతం మిగతా సంస్థలతో పోటీపడి అగ్రస్థానంలోకి దూసుకెళ్తున్నారు. కానీ తాజాగా రిలయన్స్ జియో పొదుపు చర్యలు ప్రారంభించింది. వ్యయ నియంత్రణ పేరిట 5000 మందికి పింక్ స్లిప్‌లు అందజేసి ఇంటికి సాగనంపింది.  

న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ సంస్థ తన ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. పొదుపు, వ్యయ నియంత్రణ చర్యల పేరిట ఏకంగా 5,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గత జనవరి నుంచి మొదలు మార్చి లోపు దాదాపు 5000 మందని కొలువుల్లోంచి తొలగించినట్లు సమాచారం.

వ్యయ నియంత్రణ, ఆపరేటింగ్‌ మార్జిన్ల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. జియో తొలగించిన ఉద్యోగుల్లో కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ ఎక్కువగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇంటికి పంపిన ఉద్యోగుల్లో కొంత మంది పర్మనెంట్‌ స్టాఫ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

సప్లయి చైన్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, అడ్మినిస్ట్రేషన్‌, నెట్‌వర్క్స్‌ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాల కోత ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. టీమ్‌ సభ్యుల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్‌ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. 

రిలయన్స్ జియో తీసేసిన ఉద్యోగుల్లో 600 మంది వరకు పర్మనెంట్‌ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు రిలయన్స్‌ జియో మాత్రం వ్యయాల నియంత్రణకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదని, భవిష్యత్ లోనూ ఉద్యోగులను నియమించుకుంటూనే ఉంటామని పేర్కొంది. 

వ్యాపార విస్తరణలో భాగంగా చాలా సంస్థలతో తాము ఒప్పందం చేసుకొని ఉద్యోగులను కొలువుల్లోకి తీసుకుంటామని.. సంబంధిత పని ముగియగానే వారిని తాము కొలువుల్లోంచి తప్పిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి -మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ జియో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 5 బేసిస్‌ పాయింట్ల తగ్గుదలతో 39 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.

త్రైమాసికం పరంగా కంపెనీ వ్యయాలు దాదాపు 8 శాతం పెరిగాయి. రిలయన్స్‌ జియోను భారత మార్కెట్లో దిగ్గజంగా నిలిపేందుకు సంస్థ అప్పట్లో భారీ స్థాయిలో ఉద్యోగులను కొలువుల్లోకి తీసుకుంది. అయితే ఇప్పుడు సంస్థ మార్కెట్లో స్థిరపడ్డాక వ్యయనియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగించాలని చూడడం సబబు కాదని ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రస్తుతం సంస్థలో 50 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో 10 శాతం అంటే 5 వేల మంది ఉద్యోగాల నుంచి తీసివేసింది. గత రెండేండ్లలో సంస్థ నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి సాధించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.126.20 కోట్ల లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థకు 30.67 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

click me!