వచ్చేనెల మధ్యలో భారత విపణిలోకి రెడ్‌మీ కే20, కే20 ప్రో

By rajesh yFirst Published Jun 4, 2019, 11:40 AM IST
Highlights

షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్ మీ కే20, కే20 ప్రో స్మార్ట్ ఫోన్లను వచ్చేనెల మధ్యలో భారత విపణిలోకి విడుదల చేస్తామని సంస్థ భారత్ చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు.

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ వచ్చే ఓ కొత్త ఫోన్‌ కోసం టెక్ ప్రియలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ ఇటీవల ఆ కంపెనీ సబ్‌ బ్రాండ్‌ రెడ్‌మీ ఓ ప్రీమియం ఫోన్‌ తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెడ్ మీ కే 20, కే20 ప్రో పేరిట ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఇది వరకే ఆ కంపెనీ ప్రకటించినా ఎప్పుడనేది తెలియరాలేదు. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు ఫోన్లను జూలై నెలలో విడుదల చేస్తామని షియోమీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. 

వచ్చే నెల రెండో వారంలో భారత విపణిలోకి రెడ్ మీ కే 20, కే20 ప్రో తీసుకొస్తామని షియోమీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. అంతకుమించి వివరాలేవీ వెల్లడించలేదు.

భారత్‌లో ఆ కంపెనీకి ఉన్న పోటీ దృష్ట్యా వీటి ధరలను కాస్త తక్కువగానే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎంత ధర ఉంటుందనేది మాత్రం తెలియరాలేదు. చైనాలోని ధరలతో పోల్చి చూస్తే కే20 ప్రో ధరలు 6 జీబీ విత్ 64జీబీ రామ్ వేరియంట్‌ ధర రూ.25వేలు, 6జీబీ విత్ 128 జీబీ వేరియంట్ రూ.26 వేలు ఉండే అవకాశం ఉంది. 

ఇక 8జీబీ విత్ 128 జీబీ వేరియంట్‌ కే 20 ప్రో ధర రూ.28వేలు, 8జీబీ విత్ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.30వేలు ఉండనున్నాయి.

ఇక కే20 మోడల్‌ 6జీబీ విత్ 64జీబీ, 6జీబీ విత్ 128జీబీ, 8జీబీ విత్ 256 జీబీ ధరలు.. రూ.20వేలు, రూ.21వేలు, రూ.26 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఇదే పేరుతో భారత్‌లో విడుదల కానున్నాయి. అంతకుముందు వీటిని పోకో ఎఫ్2, పోకో ఎఫ్2 ప్రో పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.

కే20 ఫోన్ 6.39 అంగుళాల డిస్ ప్లేతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 48+8+13 ఎంపీ బ్యాక్ కెమెరాలతోపాటు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ రానుంది.

షియోమీ కే20 ప్రో 6.39 ఇంచెస్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 
20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 48+8+13 ఎంపీ బ్యాక్ కెమెరాలతోపాటు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్లస్ ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో పనిచేయనుంది. ఈ రెండు ఫోన్లు పాప్‌ అప్‌ కెమెరాతో పాటు అండర్‌ డిస్‌ప్లే కెమెరాతో రానున్నాయి.
 

click me!