మైక్రోసాఫ్ట్‌ ఏఐ డిజిటల్‌ ల్యాబ్స్.. 1.5 లక్షల మందికి ట్రైనింగ్

By rajesh yFirst Published Jun 15, 2019, 10:20 AM IST
Highlights

ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సుకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే మూడేళ్లలో 1.5 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలని తలపెట్టింది. ఇందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు ఎంపిక చేసిన 10 సంస్థల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో ఏఐ డిజిటల్‌ ల్యాబ్‌లను ప్రారంభించనుంది. బిట్స్‌ పిలానీ, ఐఎస్బీ వంటి పది ఉన్నత విద్యా సంస్థల సహకారంతో వీటిని ప్రారంభిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 1.5 లక్షల మందికి వీటి ద్వారా శిక్షణ ఇవ్వాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యం. 

మూడేళ్ల గడువు గల ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ ఎంపిక చేసిన ఇనిస్టిట్యూషన్లలో శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పాఠ్యప్రణాళిక, కంటెంట్‌, క్లౌడ్‌ యాక్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సర్వీసులు, డెవలపర్‌ సపోర్ట్‌ తదితర వసతులను కల్పించనున్నది. 

కళాశాలలు, విశ్వవిద్యాలయాల సహకారంతో విద్యార్థులకు విద్యాపరంగా తగిన ఎంపికలు చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని, వారు తగిన నైపుణ్యాలు పొందడానికి అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.
 
కృత్రిమ మేధస్సు (ఏఐ)కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యాలు కల వారి అవసరం వ్యాపార సంస్థలకు మరింత ఎక్కువ అవుతోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. 

సరైన టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోపాటు పాఠ్య ప్రణాళిక, శిక్షణ వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ నైపుణ్యాలను పొందే అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

ఈ శిక్షణ నవ్య భారత నిర్మాణానికి ఎంతగానో దోహదపడుడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి తెలిపారు. 

మైక్రోసాఫ్ట్‌ ప్రోగ్రామ్‌లో బిట్స్‌ బిలానీ, ఐఎస్బీతోపాటు బీఎంఎల్‌ ముంజాల్‌ యూనివర్సిటీ, కల్పతరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేఎల్‌ యూనివర్సిటీ, పెరియార్‌ యూనివర్సిటీ, కారుణ్య యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎస్‌వీకేఎం (ఎన్‌ఎంఐఎంఎస్‌), ట్రైడెంట్‌ అకాడెమీ ఆఫ్‌ టెక్నాలజీ ఉన్నాయి.

12న ఇన్ఫోసిస్‌.. 9న టీసీఎస్ ఆర్థిక ఫలితాలు
ఐటీ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. జూన్‌తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను జూలై 12న ప్రకటించనున్నట్టు ఐటీ దిగ్గజం ఐన్ఫోసిస్‌ ప్రకటించింది. కంపెనీ శుక్రవారం ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. మిగతా దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్‌ జూలై 9న, విప్రో జూలై 17న తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి.
 

click me!