ఐఎస్‌బీతో మైక్రోసాఫ్ట్ జత.. కృత్రిమ మేధపై శిక్షణకు ల్యాబ్

By rajesh yFirst Published Aug 24, 2019, 10:51 AM IST
Highlights

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్ ఏర్పాటు చేయనున్నది. దీని ద్వారా సీఈఓలు, సీఎఫ్ఓలు వంటి వివిధ సంస్థల్లో కీలక అధికారులకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఐఎస్బీ, మైక్రోసాఫ్ట్ జత కలిశాయి. 

హైదరాబాద్‌: గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) చేతులు కలిపాయి. వ్యాపారాధిపతులతోపాటు వ్యాపార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ), ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్‌ఓ), ప్రధాన మార్కెటింగ్‌ అధికారుల (సీఎంఓ)కు కృత్రిమ మేధ (ఏఐ)పై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించాయి. 

ఇందుకోసం హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ‘ఏఐ డిజిటల్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేయడానికి రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ‘ఏఐ వినియోగంతో వ్యాపారాల రూపాంతరీకరణ’ పేరిట మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని ఇరుసంస్థలు నిర్ణయించాయి. 

ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆరంభిస్తామని మైక్రోసాఫ్ట్, ఐఎస్బీ ప్రకటించాయి. ఏడాదిలో రెండు, మూడు సార్లు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, మూడు నుంచి నాలుగేళ్లలో ఏళ్లలో సుమారు 1000 మందికి చేరువ కావాలన్నది తమ ప్రణాళిక అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. 

ఈ శిక్షణ కోసం వసూలు చేసే ఫీజు ఎంతో త్వరలో ఐఎస్‌బీ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని ప్రకటించాయి. క్లౌడ్‌, ఏఐ టూల్స్‌ను శిక్షణార్థులు వినియోగించుకునేందుకు ఐఎస్‌బీకి మైక్రోసాఫ్ట్‌ సహకరిస్తుందని తెలిపాయి.

తమ సంస్థలు, వ్యాపారాల్లో కృత్రిమమేధ వ్యూహాలు అమలు చేసేందుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మైక్రోసాఫ్ట్‌-ఐఎస్‌బీ శిక్షణ ఉపయోగ పడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి తెలిపారు. వినూత్న వ్యాపారాలు ప్రారంభించేదుకు, ప్రస్తుత వ్యాపారాలను సరికొత్తగా మార్చేందుకు, ప్రతి ఒక్కరు-సంస్థ మరింత సాధించేందుకు  దోహద పడుతుందన్నారు.

డేటా అనేది గతం అని, దీన్ని వినియోగించుకుని అంచనాలు (ప్రిడిక్షన్‌), వ్యాపార వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు ఏఐ సాయపడుతుందని వివరించారు. వినూత్నత, సాధికారతకు తోడు నియమబద్ధంగా వ్యవహరించడం ఇందులో కీలకమని తెలిపారు.

వ్యాపారాలు, విధానాల్లో నూతన మార్పులపై అవగాహన పెంచుకునేందుకు, వ్యాపారాల తీరు మార్చేందుకు, సత్వరం నిర్ణయాలు తీసుకునేందుకు, విపణిలో మరింత సమర్థంగా పోటీపడేందుకు వ్యాపారాధిపతులకు ఏఐ శిక్షణ ఉపయోగ పడుతుందని ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ భాగస్వామి అయిన ప్లాటిఫై టెక్నాలజీస్‌ సేవలు అందించే ఏఐ ల్యాబ్‌ వల్ల పరిశోధనా సామర్థ్యం ఇనుమడిస్తుందని తెలిపారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ఉత్తమ శిక్షణ అవుతుందని వివరించారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌ ఐఎస్‌బీలోనే ఈ శిక్షణ ఉంటుందని ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ స్పష్టం చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ సాంకేతికేతరమైందని ఐఎస్‌బీ అసోసియేట్‌ డీన్‌ ఆనంద్‌ నందకుమార్‌ తెలిపారు.
 

click me!