ఐడియా రైట్స్‌ఇష్యూతో రూ.18వేల కోట్లు: వొడాఫోన్ గ్రూప్‌దే పైచేయి!

By rajesh yFirst Published Apr 8, 2019, 6:39 PM IST
Highlights

విస్తరణ, వ్యాపార అవసరాల రీత్యా రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా పెట్టుబడులు చేపట్టాలని వొడాఫోన్-ఐడియా లక్ష్యంగా పెట్టుకున్నది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రైట్స్ ఇష్యూ ద్వారా విదేశీ పెట్టుబడిదారుల నుంచి రూ.18 వేల కోట్లు సేకరించనున్నది.

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ -ఐడియా రైట్స్‌ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇందులోనూ ప్రధానంగా వొడాఫోన్‌ గ్రూపే స్వయంగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతోందని విశ్వసనీయ వర్గాల కథనం. 

భవిష్యత్ అవసరాల కోసం, వ్యాపార విస్తరణ కోసం వొడాఫోన్‌ ఐడియా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు రైట్స్‌ ఇష్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఇది ప్రారంభం కాబోతోంది.

‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇవ్వాలంటూ వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు విదేశీ మదుపర్ల నుంచి వచ్చే అవకాశం ఉంది’ అని ఓ అధికారి వెల్లడించారు. 

ఏదైనా సంస్థ రూ.5,000 కోట్ల కంటే ఎక్కువగా విదేశీ నిధులు సమీకరించాలంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. వొడాఫోన్‌ ఐడియా ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఫిబ్రవరి 28నే కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

వొడాఫోన్‌ ఐడియా ప్రమోటర్లైన వొడాఫోన్‌ గ్రూపు రూ.11వేల కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూపు రూ.7,250 కోట్లు (మొత్తం రూ.18,250 కోట్లు) రైట్స్‌ ఇష్యూలో పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ.12.50 చొప్పున (మార్కెట్‌ ధరతో పోలిస్తే 61 శాతం తక్కువ ధర) రైట్స్‌ ఇష్యూ ద్వారా జారీ చేయాలని డైరెక్టర్ల బోర్డు మార్చి 20న నిర్ణయించింది. 

ఈ నెల రెండో తేదీని రికార్డు తేదీగా ప్రకటించి 87:38 నిష్పత్తిలో రైట్స్‌ ఇష్యూ ద్వారా వాటాదారులు షేర్లు పొందేలా ఆమోదం తెలిపింది. దీంతో రికార్డు తేదీ నాటికి 38 షేర్లు కలిగిన వాటాదార్లకు 87 షేర్లు లభిస్తాయి. ఇదిలా ఉంటే, రైట్స్‌ ఇష్యూ ద్వారా వొడాఫోన్‌ ఐడియా మూలధనం పెంచుకోవడంతో కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపడటంతోపాటు నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని, కవరేజీని పెంచుకునే అవకాశం ఉందని సిటీ రీసెర్చ్‌ సంస్థ అంచనా వేస్తోంది.

click me!