ఫేక్ న్యూస్‌కు ఫేస్‌బుక్ చెక్...ఇకపై చాలా స్ట్రిక్ట్ గురూ!!

By Arun Kumar P  |  First Published Jan 17, 2019, 2:04 PM IST

సోషల్ మీడియా దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫేస్‌బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ఏడాది 50 దేశాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలపై ఆచితూచి స్పందించనున్నది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన ఫేస్‌బుక్.. నకిలీ వార్తలను నియంత్రించనున్నది.  


న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ భారత్‌లో రాజకీయ ప్రకటనల విషయమై నిబంధనలను కఠినతరం చేసింది. భారత్‌లో మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. 

కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సిన భారత్‌, నైజీరియా, ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్ (ఈయూ)లో రాజకీయ ప్రకటనలపై నిబంధనలు కఠినం చేసినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ప్రకటనలలో రాజకీయాల జోక్యం అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Latest Videos

undefined

ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ తగిన నియంత్రణ చర్యలు చేపట్టనున్నది. దాదాపు అన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌ అతి పెద్ద సోషల్‌ మీడియా. రాజకీయ నాయకులు వివిధ ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకోవడమే కాక నకిలీ వార్లలు, ఇతర అనవసర ప్రచారాలు కూడా ఎక్కువయ్యాయి.
 కొన్ని ఎన్నికల నిబంధనలకు, కంపెనీ పాలసీలకు విరుద్ధంగా ఉంటుండటంతో ఫేస్‌బుక్‌ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా అధికార వర్గాల నుంచి ఫేస్‌బుక్‌పై ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ గత ఏడాది రాజకీయ ప్రకటనలను పర్యవేక్షించేందుకు పలు రకాల ప్రయత్నాలు  ప్రారంభించింది.

భారత్‌లో వచ్చే నెల నుంచి రాజకీయాల ప్రకటనలను సెర్చ్‌ చేయడానికి వీలైన ఆన్‌లైన్‌ లైబ్రరీలో ఉంచనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఇది కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేమని, కానీ కొద్ది కొద్దిగా మెరుగు చేసుకుంటూ వెళ్తామని పేర్కొన్నారు. నైజీరియాలో తక్షణం ఈ పాలసీ ప్రారంభిస్తున్నామని, ఉక్రెయిన్‌లో వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానుండగా, ఉక్రెయిన్‌లో మార్చి 31 నుంచి జరగనున్నాయి.

అమెరికా, భారతదేశంలతోపాటు పలు దేశాల ప్రభుత్వాల నుంచి ఫేస్‌బుక్ వినియోగం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.  2010లో అరబ్ దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తలెత్తిన అంతర్యుద్ధం విస్తరణకు కూడా ఫేస్ బుక్ ఒక కారణమన్న విమర్శ ఉన్నది. 

ఇక ట్యునీషియాలో సోషల్ మీడియా వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికలుగా వివిధ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వ ఆటోక్రాటిక్ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు ప్రజలను సమీకరించడానికి పూనుకున్నారు. ఇక అమెరికా ఎన్నికల్లో పేస్ బుక్ ద్వారా రష్యా జోక్యం చేసుకున్నదన్న వార్తలు, ఆరోపణలు సరేసరి. 

భారతదేశంలో లోక్ సభ ఎన్నికల వేళ అమలు చేయనున్న మార్గదర్శకాల ‘గైడ్’ విధాన నిర్ణేతలు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ‘ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ గైడ్ ఫర్ పొలిటీషియన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్’ అనే పేరుతో మార్గదర్శకాలు రూపొందించింది. 

click me!