ఐటీకి ఫ్రెష్ కొలువుల కళ: కాగ్నిజెంట్‌లో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ఇలా..

By rajesh yFirst Published May 30, 2019, 11:35 AM IST
Highlights

వచ్చే ఏడాది ఐటీ రంగ నిపుణులకు.. ప్రత్యేకించి ఎంట్రీ లెవెల్ ఇంజినీర్లకు అవకాశాలు పుష్కలం. ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ మధ్య ఐటీ దిగ్గజ సంస్థలు ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించి క్యాంపస్ సెలక్షన్లు చేపట్టనున్నాయి. వచ్చే ఏడాదికి ఆఫర్ లెటర్ అందజేయనున్నాయి. ఇక అమెరికా ఐటీ మేజర్ కాగ్నిజెంట్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు 18 శాతం ఎక్కువ వేతనం ఆఫర్ చేస్తోంది. 

న్యూఢిల్లీ: అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఎంట్రీ లెవల్‌లో చేరే ఉద్యోగుల వేతనాలు పెరుగుతున్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది కంపెనీలో చేరుతున్న వారికి పెంచే వేతన ప్యాకేజీని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. 18 శాతం అధిక వేతన ప్యాకేజీని ఇస్తున్నట్టు చెబుతున్నారు. 

2020 జూన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కాగ్నిజెంట్‌ ఇచ్చే వార్షిక వేతన ఆఫర్‌ రూ.3.38 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెరగనుందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి భారత్‌లో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

కాగా ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల మధ్య ఉద్యోగుల నియామకాల కోసం క్యాంప్‌సలను సందర్శించనున్నాయి. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కంపెనీలోకి తీసుకునే వారికి ఆఫర్‌ లెటర్లను ఇస్తాయి. ఇదిలా ఉంటే వేతనాల పెంపును కాగ్నిజెంట్‌ ఉన్నతాధికారి ధృవీకరించారు. డిజిటల్‌ టెక్నాలజీల్లో ‘ప్రీమియం’ నైపుణ్యం గల  ఉద్యోగులకు అధిక వేతన ప్యాకేజీని ఇప్పటికే అమలు చేస్తున్నట్టు చెప్పారు.
 
ఇందుకు అనుగుణంగానే ఎంట్రీ లెవల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వేతనాన్ని పెంచాలని నిర్ణయించినట్టు కాగ్నిజెంట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాము నియమించుకునే ఇనిస్టిట్యూట్లలోని ఇంజనీరింగ్‌ విద్యలో డిజిటల్‌ టెక్నాలజీలు భాగంగా ఉన్నాయని చెప్పారు. 

ప్రస్తుతం డిజిటల్‌ టాలెంట్‌ అవసరం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో తమ కంపెనీలోని ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మరింతగా పెట్టుబడులు పెడుతున్నామని కాగ్నిజెంట్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 2018లో కంపెనీలోని 1.5 లక్షలకు పైగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చినట్టు ఆయన చెప్పారు. 

కాగా ఇంజనీరింగ్‌ క్యాంప్‌సలలో ఎన్ని జాబ్‌ ఆఫర్లు ఇచ్చిన విషయాన్ని మాత్రం కంపెనీ ఉన్నతాధికారి తెలియజేయలేదు. ఇదిలా ఉంటే.. కాగ్నిజెంట్‌ వార్షికంగా సగటున 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటుందని ప్లేస్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. 

కాగా ప్రస్తుతం ఎంట్రీలెవల్‌లో చేరే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వార్షిక వేతనం రూ.3.30-3.60 లక్షలు ఉంది. కాగ్నిజెంట్‌ రాబడిలో డిజిటల్‌ సొల్యూషన్ల వాటా దాదాపు 33 శాతంగా ఉంది. ఈ కంపెనీ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుంటోంది.

click me!