జానీ ఈవ్ నిష్క్రమణతో ఆపిల్‌కు 10 బిలియన్ డాలర్ల లాస్

By rajesh yFirst Published Jun 29, 2019, 11:02 AM IST
Highlights

ఆపిల్‌ నుంచి వైదొలగనున్నట్లు ఐఫోన్‌ రూపకర్త, సంస్థ చీఫ్ డిజైనర్ జానీ ఈవ్ పేర్కొన్నారు. ‘లవ్ ఫ్రమ్’ పేరుతో ఏర్పాటు చేయనున్న సంస్థ 2020 నుంచి సేవలను ప్రారంభిస్తుంది. జానీ ఈవ్ నిష్క్రమణను ఆపిల్ కూడా ధ్రువీకరించింది. జానీ ఈవ్ తో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.

న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ గట్టి ఎదురుదెబ్బ తగిలిగింది. ఐఫోన్‌, ఐపాడ్‌, ఐమ్యాక్‌, ఆపిల్ వాచ్ డిజైన్ల రూపకల్పనతోపాటు వాటిని డెవలప్ చేయడంలో కీలక భూమిక పోషించిన ఆపిల్ చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ జానీ ఈవ్ సంస్థను వీడనున్నారు. ఆయన వచ్చే ఏడాది సొంతంగా కంపెనీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆపిల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు జానీ ఈవ్ ప్రకటించి అమెరికా మార్కెట్లకు షాక్ ఇచ్చినంత పని చేశారు. ఆపిల్‌కు 10 బిలియన్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. 

 

అయితే సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నా భవిష్యత్ ఆపిల్ ఉత్పత్తుల రూపకల్పన టీంతో కలిసి పని చేస్తానని జానీ ఈవ్ హామీ ఇచ్చారు. తాను ఏర్పాటు చేసే సంస్థ ఆపిల్, దాని ప్రైమరీ క్లయింట్లతోనే కలిసి పని చేయనుండటం గమనార్హం. 

 

1997లో ఆపిల్‌లో స్టీవ్‌ జాబ్స్‌ తిరిగి చేరాక, జానీ ఈవ్‌ దశ తిరిగింది. ఈనాడు ప్రపంచవ్యాప్త ప్రముఖ డిజైనర్లలో ఆయన ఒకరు. 1998లో ఐమ్యాక్‌, ఆ తర్వాత సంవత్సరాల్లో ఐఫోన్‌, ఐపాడ్‌, మాక్‌బుక్‌ ఎయిర్‌లను డిజైన్‌ చేయడంలో జానీ ఈవ్ కీలక పాత్ర పోషించారు.

 

ఆపిల్ కంపెనీలోనే ఒక రహస్య డిజైన్‌ స్టూడియోలో వీటన్నింటికీ జానీ ఈవ్ ప్రాణం పోశారని చెబుతారు. ఈయన డిజైన్లను వినియోగదారులు ఇష్టపడడంతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. ప్రస్తుతం ఆపిల్‌ చీఫ్‌ డిజైనర్‌గా ఉన్న ఈయన, ఏడాది చివర్లో కంపెనీని వీడనున్న విషయాన్ని సంస్థ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. 

 

సొంతంగా డిజైన్‌ స్టూడియో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న జానీ ఈవ్‌ పెట్టే కొత్త కంపెనీ పేరు లవ్‌ఫ్రమ్‌. 2020లో ఇది పూర్తి స్థాయి సేవలు అందించే అవకాశం ఉంది. అయితే జానీతో పనిచేయడానికి కంపెనీ ఎదురుచూస్తోందని ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పేర్కొనడం గమనార్హం.

 

‘డిజైన్‌ ప్రపంచంలో జానీ ఒకే ఒక్కడు. ఆయన లేకుండా యాపిల్‌ పునరుజ్జీవం చెందేది కాదు. ఐమ్యాక్‌ మొదలు ఐఫోన్‌ల వరకు ప్రాణం పోశాడు. అందుకే భవిష్యత్‌లో ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆయన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటాం’అని టిమ్ కున్ అన్నారు. జానీ ఈవ్ లేకుండా గొప్ప ఫలితాలు సాధిస్తామని చెప్పలేనన్నారు. అయితే అసాధారణ ప్రతిభా పాటవాలు గల డిజైనింగ్ టీమ్‌ను రూపొందించామని టిమ్ కుక్ చెప్పారు."

 

ఆపిల్ పార్క్ రూపకల్పనలోనూ కీలక భూమిక వహించిన జానీ ఈవ్‌ 1990వ దశకంలో సంస్థలో చేరారు. జానీ ఈవ్‌కు  ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌ స్పిరిచ్యువల్ పార్టనర్.  

click me!