'వర్క్​ ఫ్రం హోం'తో ఉద్యోగులకు లాభమా, నష్టమా..

By Sandra Ashok KumarFirst Published Jul 3, 2020, 12:10 PM IST
Highlights

కరోనాతో పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల సంస్థలకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గినా డేటా భద్రత విషయమై అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నుంచే పని చేస్తుండటంతో కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే వీలు ఉద్యోగులకు లభిస్తోంది.

న్యూఢిల్లీ: వివిధ ఐటీ సంస్థల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోం) పని చేయడం ఆనవాయితీగానే వస్తున్నది. దీని వల్ల వల్ల కంపెనీలకు లాభమా, నష్టమా.. ఉద్యోగులకు అంతా సౌకర్యమేనా? కష్టాలేం లేవా? అని అంటే, ఇరువైపులా రెండూ ఉన్నాయనే చెప్పాలి.

కంపెనీలకు నిర్వహణ వ్యయాలు తగ్గినా, డేటా భద్రత, ర్యాన్సమ్‌వేర్‌ దాడుల నుంచి కాపాడుకోవడానికి అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటినుంచే పనిచేస్తున్నందున, కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే వీలు ఉద్యోగులకు లభిస్తోంది. రాకపోకలకు సమయం వృథా కాదు కనుక, ఆ సమయం కూడా తమ కోసమే వెచ్చించమని కంపెనీలు కోరడం.. కాదు కాదు ఆదేశించడమే ఎక్కువగా జరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.

దేశంలో 45 లక్షల మంది, హైదరాబాద్‌ పరిసరాల్లోనే 5,6 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా, పెద్ద-మధ్యస్థాయి ఐటీ కంపెనీలలో 10-15 శాతం మంది మాత్రమే కార్యాలయాలు వచ్చి పనిచేస్తుండగా, మిగిలినవారు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

‘ఇంట్లోనే ఉంటున్నారు కదా.. అంటూ అదనపు గంటలు పని చేయమనే ఒత్తిడి యాజమాన్యాల నుంచి వస్తోంది’ అని పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయిస్తున్నారని, శనివారాలు కూడా విధుల్లో ఉండాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో, ఉద్యోగం కావాలి కనుక సర్దుకుపోతున్నామనే చెబుతున్నారు. 

ఖాతాదారులు బిల్లింగ్‌లో రాయితీలు అడుగుతున్న నేపథ్యంలో, వేతనకోత/ఉద్యోగుల తొలగింపులు నివారించాలంటే, సంతృప్తికర స్థాయిని మించి పనిచేయాల్సి వస్తుందని ఐటీ పరిశ్రమల ఉన్నత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకుముందు మేనేజర్ల స్థాయిలో ఉద్యోగులు కొంతవరకు సర్దుబాటు చేసుకునేవారు.

also read 

ఇప్పుడు అలా కాదు ఎన్ని టాస్క్‌లు చేశారు/ రివ్యూ చేశారు/ ఎంత బిల్‌ చేశారు.. అనేది రోజూ నోట్‌ అవుతోందని అమెరికా, భారత్‌లలో కంపెనీలను నిర్వహిస్తున్న టెక్‌ ఎరా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ కిరణ్‌ తెలిపారు.

ఇంటి నుంచి పనిలో ‘విధులకు/వ్యక్తిగతానికి సమయం ఎలా కేటాయించాలి’ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు కంపెనీలు ధ్రువీకరించే వీలు ఉన్నదన్నారు. ఉద్యోగులు ఇంటి నుంచే లాగిన్‌ అవుతున్నప్పుడు వారి వేసుకునే దుస్తులు, పరిసరాలతో ‘ప్రొఫెషనల్‌ వాతావరణం’ అంతగా కనపడదనే ఆందోళన కంపెనీల్లో ఉందన్నారు.

కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకున్న వారికి, కంపెనీలో అవకాశం ఇచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌లో పని ఉండదు. ఎలా పనిచేయాలనే అంశంపై శిక్షణ ఇస్తూ, 90 రోజుల తర్వాత మెరికల్లాంటి వారైతే 60 రోజుల్లో ప్రాజెక్ట్‌ కేటాయిస్తారు. దాదాపు ప్రతి కంపెనీలో 10 శాతం వీరే ఉంటారు.

ప్రాజెక్ట్‌లో చేరాక, ఏడాది వ్యవధిలో పూర్తిస్థాయి విధులకు వీరు సిద్ధమవుతుంటారు. అలాంటిది వీరినీ ఇంటి దగ్గర ఉంచి, శిక్షణ ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. బృందసభ్యులు ఐక్యంగా చేయాల్సిన వైవిధ్యమైన ప్రాజెక్టులకు మాత్రం ‘ఇంటి నుంచి పని’ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిజైనింగ్‌, పరిశోధన -అభివృద్ధి ప్రాజెక్టులు, నిర్దేశిత స్వల్ప సమయానికి పూర్తి చేయాల్సినవి, కచ్చిత ప్రణాళిక- మోడల్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి.

ఐటీ కంపెనీల్లో మార్చి నెలాఖరు నాటికి ఆయా సంస్థల నుంచి స్వీయమదింపు నివేదికలు సమీకరించి, ఏప్రిల్‌ తరవాత అతి తక్కువ పనితీరు కనబరచిన 5 శాతం మంది వరకు తొలగిస్తుంటారు. ఈసారి కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇలాంటివి తక్కువగా ఉండటమే ఉద్యోగులకు ఊరట కలిగంచే అంశమే.

click me!