అచ్చం మనిషి మెదడులా పనిచేసే సూపర్ కంప్యూటర్.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆవిష్కరణ , వచ్చే ఏడాదే ‘‘యాక్టివేషన్’’

By Siva KodatiFirst Published Dec 14, 2023, 6:21 PM IST
Highlights

కృత్రిమ మేథ రాకతో రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ నుంచి మానవాళికి ఏం ముప్పు పొంచుకొస్తుందోనని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆస్ట్రేలియా అభివృద్ధి చేస్తోన్న సూపర్ కంప్యూర్ వచ్చే ఏడాది యాక్టీవ్‌గా మారడానికి సిద్ధంగా వుంది. 

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎన్నో సినిమాల్లో కంప్యూటర్లు మనిషి మేథస్సును మించి పనిచేయడం మనం చూశాం. మనిషితో సమానంగా కొన్ని సార్లు మనిషిని మించిన శక్తి సామర్ద్యాలను కంప్యూటర్లు చూపాయి. ఇప్పుడు కృత్రిమ మేథ రాకతో రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ నుంచి మానవాళికి ఏం ముప్పు పొంచుకొస్తుందోనని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆస్ట్రేలియా అభివృద్ధి చేస్తోన్న సూపర్ కంప్యూర్ వచ్చే ఏడాది యాక్టీవ్‌గా మారడానికి సిద్ధంగా వుంది. ఈ సంచలనాత్మక వ్యవస్థ పూర్తి స్థాయిలో మానవ మెదడును పోలినట్లుగానే రూపొందించారు. తక్కువ విద్యుత్ వినియోగంతోనే మనిషి మెదడు ఎలా సమర్ధవంతంగా విస్తారమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయగలుగుతుందనే రహస్యాలను విప్పే లక్ష్యంతో శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. 

సిడ్నీలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ న్యూరో మార్ఫిక్ సిస్టమ్స్ (ఐసీఎన్ఎస్) పరిశోధకులు ఈ సూపర్ కంప్యూటర్ సృష్టికర్తలు. దీనిని ‘‘డీప్‌సౌత్’’గా పిలుస్తున్నారు. దానిలో అమర్చిన చిప్‌లలో స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్‌లు వున్నాయి. ఇంటెల్, డెల్‌లు కూడా ఈ ప్రయోగంలో తమ సహకారం అందించాయి. మన మెదడు సమాచారాన్ని ఎలా విశ్లేషించి నిర్వహించగలుగుతుందనే రహస్యాలను అన్‌లాక్ చేయడమే లక్ష్యంగా డీప్‌సౌత్ ప్రాజెక్ట్ పనిచేయనుంది. 

వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ విడుదల చేసిన దాని ప్రకారం.. జీవ ప్రక్రియలను అనుకరించే న్యూరోమార్ఫిక్ సిస్టమ్‌ను డీప్‌సౌత్ ఉపయోగించనుంది. హార్డ్‌వేర్‌ను ఉపయోగించి సెకనుకు 228 ట్రిలియన్ సినాప్టిక్ ఆపరేషన్‌ల వద్ద స్పైకింగ్ న్యూరాన్‌ల వంటి భారీ నెట్‌వర్క్‌లను ఇది అనుకరిస్తుంది. మానవ మెదడులోని కార్యకలాపాల అంచనా రేటుకు పోటీగా ఇది వుంటుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న సూపర్ కంప్యూటర్‌లతో పోలిస్తే డీప్‌సౌత్ పనితీరు వేరుగా వుంది. ఎందుకంటే ఇది న్యూరాన్ నెట్‌వర్క్‌ల వలె పనిచేసే ఉద్దేశంతో నిర్మించబడింది. తక్కువ శక్తి, ఎక్కువ సామర్ధ్యాలను ఇది అనుమతిస్తుంది. సాంప్రదాయ కంప్యూటింగ్ లోడ్‌ల కోసం ఆప్టిమైజ్ చేయబడిన సూపర్‌ కంప్యూటర్‌ల పనితీరుని ఇది విభేదిస్తుందని ఐసీఎన్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రీ స్కైక్ అన్నారు. 

మెదడు లాంటి నెట్‌వర్క్‌లను స్కేల్‌లో అనుకరించడంలో మన అసమర్ధత వల్ల న్యూరాన్‌లను ఉపయోగించి మెదడులు ఎలా గణిస్తాయనే దానిపై మన అవగాహనలో పురోగతి దెబ్బతింటుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ), మల్టీకోర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ) ఉపయోగించి ప్రామాణిక కంప్యూటర్‌లలో స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్‌లను అనుకరించడం శక్తితో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు.

అయితే తాము అభివృద్ధి చేసిన వ్యవస్ధ దానిని మారుస్తుందని ఆండ్రీ అన్నారు. ఈ ఫ్లాట్‌ఫాం మనిషి మెదడుపై మన అవగాహనను మెరుగుపరుస్తుందని ఆయన ఆకాంక్షించారు. సెన్సింగ్ , బయోమెడికల్, రోబోటిక్స్, స్పేస్, లార్జ్ స్కేల్ ఏఐ అప్లికేషన్‌లు సహా విభిన్న రంగాలలో ఇది మెదడు స్థాయి కంప్యూటింగ్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తుందని ప్రొఫెసర్ ఆండ్రీ వెల్లడించారు. 
 

click me!