
వీరేంద్ర సెహ్వాగ్.. డాషింగ్ ఓపెనర్‌గా, విధ్వంసక ఆటగాడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న క్రికెటర్. అతను క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు చుక్కలే... బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బంతి బౌండరీ దాటాల్సిందే.. 99 పరుగుల వద్ద కూడా క్రీజును వదిలి సిక్సర్ కొట్టగలిగిన బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నాడంటే అది సెహ్వాగ్ ఒక్కడే. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అందరు క్రికెటర్లలా కామెంటేటర్‌గా కాకుండా కొత్త జనరేషన్‌కు మెరుగులు దిద్దుతూ.. మెంటార్‌గా, కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు.
తాజాగా ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు... యూఏఈ టీ10 క్రికెట్ లీగ్‌లో సెకండ్ సీజన్ కోసం మరాఠా అరేబియన్స్ జట్టు సెహ్వాగ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. గతేడాది ఇదే జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..
మొదటి సీజన్‌లో కేరళ కింగ్స్ చేతిలో మరాఠా అరేబియన్స్ జట్టు ఓడిపోయింది. రెండో సీజన్‌లో కూడా సెహ్వాగ్ ఆడతాడని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరేంద్రుడు లీగ్ నుంచి తప్పుకున్నాడు. అతని సేవలను ఎలాగైనా జట్టుకు అందించాలని భావించిన మరాఠ అరేబియన్స్ జట్టు యజమాన్యం బ్యాటింగ్ కోచ్‌గా ఉంచాలనుకుంది. ఈ ప్రతిపాదనకు సెహ్వాగ్ అంగీకరించడంతో ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది.