
Sepaktakraw Star Navatha: చిన్నవయస్సులోనే సెపక్‌తక్రా ఆటకు అభిమాని అయిన నవతా, క్రమంగా ఆటలో ప్రతిభ చూపిస్తూ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్లలో ఒకరుగా మారారు. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించడానికి గోవాలో శిక్షణ పొందుతున్న సమయంలో ఆమె అవకాశాలకు దెబ్బతగిలింది. 2024 ఆసియా గేమ్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఆమె కాలుకు గాయం అయింది. శిక్షణ సమయంలో కాలి గాయంతో ఆమె కలలు కొన్ని నెలలపాటు ఆగిపోయాయి.
అయితే, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని నవతా అద్భుతమైన రికవరీతో నేషనల్ మెడల్ తో అద్భుతమైన పునరాగమనం చేసింది. ఇటీవలే నేషనల్ గేమ్స్‌లో రజత పతకం సాధించడం ఆమె ప్రతిభకు సాక్ష్యంగా నిలిచింది.
సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోస్కోపీ, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ హరిప్రకాశ్ ఈ రికవరీలో కీలక పాత్ర వహించారు. డాక్టర్ హరిప్రకాశ్ మాట్లాడుతూ, “నవతా శిక్షణ సమయంలో తీవ్రమైన కాలి గాయంతో పోరాడారు. కాలి లోపలి ACL (అంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్) పూర్తిగా దెబ్బతిన్నది. గాయం తీవ్రత కారణంగా ఆపరేషన్ అవసరమైంది. మొదట రెండు వారాలు వాపు తగ్గిన తర్వాత ఆమె స్వంత లిగమెంట్ ఉపయోగించి ACL ను పునర్నిర్మించారు. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీతో ఆమె పూర్తి రికవరీ సాధించి మళ్లీ ఆట ప్రారంభించింది. నేషనల్ మెడల్ గెలవడం నిజంగా ప్రశంసనీయం” అని అన్నారు.
అలాగే, “థై నుండి లిగమెంట్ తీసుకోవడం శరీరానికి దీర్ఘకాల హాని కలిగించదు. శరీరం దీనిని ఆర్టిఫిషియల్ లిగమెంట్ల కంటే త్వరగా స్వీకరిస్తుంది. ఎక్కువ లిగమెంట్లు దెబ్బతింటే మాత్రమే సింథటిక్ గ్రాఫ్ట్ వాడుతాము. ఆటలో గాయాలు అయితే వెంటనే డాక్టర్ సంప్రదించడం అత్యంత ముఖ్యం. అది ACL మాత్రమే గాయమా లేదా మెనిస్కస్, కార్టిలేజ్ కూడా దెబ్బతిన్నాయా అనేది గుర్తించడానికి సహాయపడుతుంది” అని డాక్టర్ హరిప్రకాశ్ అన్నారు.
“గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొనడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ గాయం పెద్ద షాక్ గా మారింది. వెంటనే ఆన్‌లైన్‌లో ఉత్తమ స్పోర్ట్స్ సర్జన్ కోసం వెతికి KIMS డాక్టర్ హరిప్రకాశ్‌ను కనుగొన్నాను. హాస్పిటల్ దగ్గర ఉండటం కారణంగా వెంటనే ఆపరేషన్ కు సిద్ధం అయ్యాను. తర్వాత, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో ముంబైలో ఉద్యోగం పొందడం వల్ల ఫిజియోథెరపీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. దాంతో రికవరీ ఆలస్యమైంది. అక్టోబర్–నవంబర్ 2024లో మెల్లగా ప్రాక్టీస్ ప్రారంభించాను” అని తెలిపారు.
“సెపక్‌తక్రా ఆట, లెగ్ వాలీబాల్ లాగా ఉంటుంది, బంతి చేతికి తగిలితే ఫౌల్. కాబట్టి ఆట కాళ్లపై ఆధారపడి ఉంటుంది. కాలి ఆపరేషన్ తర్వాత మళ్లీ ఆడగలనా అనే అనుమానం నాకు ఉంది. కానీ సర్జరీ విజయవంతంగా కావడం, ఫిజియోథెరపీ వల్ల నేను పూర్తిగా రికవర్ అయ్యాను. నేషనల్ మెడల్ గెలవడం నా జీవితంలో గొప్ప విజయం” అని నవతా వెల్లడించారు.