
Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు నిరాశే మిగిలింది. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ భారీ అంచనాలతో జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి దిగాడు… కానీ అతను 8వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇలా పతకానికి చాలా దూరంలో నిలిచాడు.
అయితే ఎలాంటి అంచనాలు లేకుండా జావెలిన్ త్రో లో బరిలోకి దిగిన భారత ఆటగాడు సచిన్ యాదవ్ ఆరంగేట్రంలోనే అదరగొట్టారు. అతడు నీరజ్ చోప్రా కంటే మెరుగైన ప్రదర్శన చేసి 4వ స్థానం సాధించాడు. ఇలా సచిన్ యాదవ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను కూడా ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లోనే నమోదు చేశాడు.
టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో ఏ అథ్లెట్ కూడా 90 మీటర్ల మార్కును దాటలేదు. ఈ పోటీలో నీరజ్ చోప్రా తన ఐదు ప్రయత్నాలలో సరిగా రాణించలేకపోయాడు… కేవలం 84.03 మీటర్లు విసిరి 8వ స్థానంతో నిష్క్రమించాడు. 2021లో ఇదే టోక్యో మైదానంలో ఒలింపిక్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఈసారి ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేసి పోటీ నుంచి తప్పుకున్నాడు.
పోటీ నిబంధనల ప్రకారం… మొదటి ఆరు స్థానాల్లో ఉన్నవారు మాత్రమే ఫైనల్, ఆరో రౌండ్‌లో పోటీపడతారు. ఈ నేపథ్యంలో భారతదేశం తరఫున ఫైనల్ రౌండ్‌లో సచిన్ యాదవ్ మాత్రమే నిలిచాడు.
మరో ఇండియన్ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ తన మొదటి ప్రయత్నంలోనే 86.27 మీటర్లు విసిరి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. దీనితో అతను నీరజ్ చోప్రానే కాకుండా జర్మనీ స్టార్ ప్లేయర్ జూలియన్ వెబర్ (86.11 మీ), ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ (82.75 మీ)లను కూడా అధిగమించాడు.
ఈ పోటీలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన జావెలిన్ త్రోయర్ కేశోర్న్ వాల్కాట్ 88.16 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (87.38 మీటర్లతో) రజత పతకాన్ని, కర్టిస్ థాంప్సన్ (86.67 మీటర్లతో) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. గతసారి రజతం గెలిచిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, నాలుగో రౌండ్‌లోనే నిష్క్రమించాడు.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన నీరజ్ చోప్రా, తన మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు, రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. తర్వాత నాలుగో ప్రయత్నంలో 82.86 మీటర్లు విసిరాడు. తన ఐదో ప్రయత్నంలో, కెన్యాకు చెందిన జూలియస్ యెగోను దాటి 85.54 మీటర్లు విసిరితేనే పోటీలో నిలవగలిగే స్థితిలో అతను విఫలమయ్యాడు.
జావెలిన్ విసిరిన తర్వాతఅతను ఒక పక్కకు పడిపోయి, లైన్‌ను దాటాడు. దీంతో రిఫరీ రెడ్ ఫ్లాగ్ చూపించాడు. వెంటనే తన నడుము బెల్ట్‌ను తీసి ముఖం కప్పుకుని కాసేపు కూర్చున్నాడు. నిరంతరం 85 మీటర్లకు పైగా విసిరే నీరజ్, ఈసారి ఐదు ప్రయత్నాలలో 85 మీటర్ల మార్కును కూడా దాటకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
2024 మేలో దోహా డైమండ్ లీగ్ సిరీస్‌లో 90.23 మీటర్లు విసిరి 90 మీటర్ల మార్కును అందుకున్న నీరజ్ చోప్రా, ఆ తర్వాత అతని ప్రదర్శనలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. నీరజ్ కంటే యువ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ ఈ వరల్డ్ అథ్లెటిక్ ఛాపియన్ షిప్ 2025 లో అదరగొట్టాడు.