సచిన్‌ను కలిసి నా మెడల్ చూపించాలనుకుంటున్నా: పారాలింపిక్స్‌ సిల్వర్ విన్నర్ భవీనా పటేల్

By telugu teamFirst Published Aug 29, 2021, 4:03 PM IST
Highlights

క్రికెట్ అభిమానులకు దైవసమానుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్‌ తనకు ఇన్‌స్పిరేషన్ అని పారాలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ అన్నారు. ఇండియాకు తిరిగి రాగానే సచిన్‌ను కలిసి ఆయనకు తాను గెలుచుకున్న మెడల్ చూపించాలని ఉబలాటపడుతున్నట్టు వివరించారు.
 

న్యూఢిల్లీ: పారాలింపిక్స్ తొలి పతకాన్ని భారత్‌కు అందించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు ప్రేరణ అని వెల్లడించారు. భారత్‌కు తిరిగి రాగానే సచిన్‌ను కలిసి తన మెడల్ చూపించాలని ఆశపడుతున్నట్టు వివరించారు. ఆయన ఇచ్చే ఇన్‌స్పిరేషనల్ స్పీచ్‌లో మునిగిపోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టోక్యోలో జరుగుతున్న 2020 పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ టేబుల్ టెన్నిస్‌ ఆడారు. ఫైనల్‌లో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసజల్లు కురుస్తున్నది.

ఓ టీవీ చానెల్‌తో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘నేను సచిన్ టెండూల్కర్ ద్వారా ప్రేరణ పొందుతూ వస్తున్నాను. ఆయనను నేను స్వనయనాలతో చూడాలనుకుంటున్నాను. ఆయన మోటివేషనల్ స్పీచ్‌లలో తేలియాడాలనుకుంటున్నాను. అవి మరింత ప్రేరణ, ఉత్తేజాన్ని నాలో కలిగిస్తాయి. ఆయనను కలిసి నా పతకాన్ని చూపించాలనుకుంటున్నాను’ అని తెలిపారు.

‘మెడిటేషన్ చేయడం నా బలం. టేబుల్ టెన్నిస్ కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ముగుస్తుంది. ప్రపంచంలో వేగంగా ముగిసే రెండో ఆట ఇదే. కాబట్టి, నా మదిని మెడిటేషన్ ద్వారా నా నియంత్రణలో ఉంచుకుంటాను. తద్వారా గేమ్‌పై ఫోకస్ పెట్టగలుగుతాను’ అని వివరించారు. 2018లో పారా ఏషియన్ గేమ్స్‌లో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.

click me!