Speed Skating Games 2021: మన దేశంలో పెద్దగా పరిచయం లేని ఆటలో ఓ కుర్రాడు ఏకంగా భారత్ కు పతకాన్ని పట్టుకొచ్చాడు. స్పీడ్ స్కేటింగ్ గేమ్స్ లో పాల్గొన్న తమిళనాడు కుర్రాడు ఆనంద్ వెల్కుమార్.. ఈ ఆటలలో భారత్ కు తొలి పతకాన్నిఅందించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
తమిళనాడుకు చెందిన ఆనంద్ వెల్కుమార్ (Anand Velkumar) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియా (India)లో అంతగా పరిచయం లేని.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని స్కేటింగ్ లో.. అతడు ఏకంగా పతకాన్నే సాధించాడు. అదేదో రాష్ట్ర స్థాయో.. జాతీయ స్థాయో కాదు.. ఏకంగా ప్రపంచ వేదికపైనే రజత పతకాన్ని దక్కించుకున్నాడు. సాధారణంగా ఈ ఆటలో ఆధిపత్యం చెలాయించే కొలంబియా, పోర్చుగీసు వాళ్లను దాటి మరీ భారత్ కు రజత పతకం అందించాడు. ఈ ఈవెంట్ లో అతడితో పాటు మరికొందరు భారతీయ ఆటగాళ్లు కూడా మెరిశారు.
కొలంబియాలోని Mundiales Ibagueలో నవంబర్ 6 నుంచి 12 మధ్య వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ గేమ్స్ (World Speed Skating Games 2021) జరిగాయి. ఈ ఈవెంట్ లో భారత్ నుంచి ఆనంద్ వెల్కుమార్ తో పాటు ధనుష్ బాబు, గుర్క్రీత్ సింగ్, సిద్ధాంత్ కాంబ్లీ కూడా పాల్గొన్నారు.
undefined
అయితే ఈ ఈవెంట్ లో ఆనంద్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. జూనియర్ 15 కిలోమీటర్ల ఎలిమినేషన్ ఫైనల్ లో పాల్గొన్న ఆనంద్.. 24 నిమిషాల 14.845 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరి సిల్వర్ మెడల్ నెగ్గాడు. భారత్ తరఫున ఈ పోటీలలో రజత పతకం నెగ్గిన తొలి ఆటగాడిగా ఆనంద్ చరిత్ర సృష్టించాడు. ఈ పోటీలలో కొలంబియాకు చెందిన ఫోన్సెకా (Miguel Fonseca) , మార్కో లిరా (Marco Lira) లు మొదటి, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక భారత ఆటగాళ్లైన ధనుష్ ఆరో స్థానంలో నిలువగా.. గుర్క్రీత్, సిద్ధాంత్ లు ఎనిమిదో ప్లేస్ సాధించారు. ఆర్తి కస్తూరి రాజ్ పదో స్థానం దక్కించుకుంది.
కాగా ఈ విజయంతో ఆనంద్.. త్వరలో అమెరికాలో జరుగనున్న వరల్డ్ గేమ్స్ లో కూడా అర్హత సాధించాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా గేమ్స్ లో కూడా ఈ గేమ్ ను చేర్చారు. దీంతో ఆ పోటీలలో భారత్ తరఫున ఈ యువ ఆటగాళ్లు మెరవడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఇక తన విజయంపై ఆనంద్ మాట్లాడుతూ.. ‘దేశానికి తొలి పతకం అందించడంపై నా ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇది చాలా కష్టమైన ఆట. ముఖ్యంగా వర్షం పడుతుండగా కూడా మేము స్కేటింగ్ ను కొనసాగించాం. ఫీల్డ్ తడిగా ఉంది. ఏ మాత్రం పట్టు తప్పినా కింద పడిపోవడం ఖాయం. కింద పడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించాను’ అని తెలిపాడు.