సామాన్యునికి ‘ఉడాన్’ అవసరమా ?

First Published Oct 22, 2016, 5:19 AM IST
Highlights
  • సామాన్యునికి ఉడాన్ అవసరమా?
  • ఎర్ర బస్సులే లేని గ్రమాలు లక్షల్లో ఉన్నాయి
  • కేంద్రం ఆలోచించాల్సింది బస్సు సౌకర్యాల గురించి
     

సామాన్యుడికి విమాన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు ఉడాన్ పథకం అవసరమా? అవసరమేనన్న ఉద్దేశ్యంతో
సామాన్యుని కోసం కేంద్రం ‘ఉడాన్’ పథకం ప్రారంభించిందా? అలాగని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెబుతున్నారు. అయితే, ఈ సందర్భంగా అనేక మౌళికమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటికీ కనీసం ఎర్రబస్సు సౌకర్యం కూడా లేని గ్రామాలు లక్షల్లో ఉంటాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో  ఈ సమస్య మరింత ఎక్కువ. అటువంటి రాష్ట్రాల్లో కనీస, సామాన్యుని రవాణా సౌకర్యమైన బస్సులను కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఏర్పాటు చేస్తే కోట్లాది మంది ప్రజల అత్యవసరాలు తీరుతాయి.

  మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ నగరాలు, పట్టణాల నుండి నేరుగా బస్సు సౌకర్యం లేని గ్రామాలు వేలాది సంఖ్యలో ఉంటాయి. సరైన బస్సు సౌకర్యాలు లేకపోవటంతో లక్షలాది మంది ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్న సంగతి ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులకు తెలీని విషయమూ కాదు.

రవాణా సౌకర్యాలపరంగా ఇటువంటి పరిస్ధితులున్న మనదేశంలో సామాన్యుని కోసం కేంద్రం ఉడాన్ పథకాన్ని తేవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా 500 కిలోమీటర్ల దూరానికి రూ. 2500 మాత్రమే వసూలు చేయనున్నట్లు రాజు గారు చెప్పటం మరింత ఆశ్చర్యకరం. రాజుగారు చెప్పిన పథకం వివరాలు చూస్తుంటే అదేదో కేవలం బిజినెస్ లేక అవస్తలు పడుతున్న విమానయాన సంస్ధలను ఆదుకునే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని తెస్తున్నట్లు సామాన్యులు అనుమానపడితే వారి తప్పుకాదు.

 ఇప్పటికీ బస్సుల్లో కిలోమీటర్ కు ఒకేసారి రూపాయి పెరిగితే అల్లాడిపోయే ప్రజలున్న దేశం మనది. అటువంటిది సామాన్యునికి విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలన్న కేంద్రప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో అనుమానమే. ఇప్పటికే రాష్ట్రంలో కడప, మధురవాడ, పుటపర్తి లాంటి విమానాశ్రయాల్లో ప్రయాణీకుల రద్దీ లేక అవస్తలు పడుతున్నాయి.

 పైగా పుటపర్తి విమానాశ్రయాన్ని దాదాపు మూసేసేందుకు సాయిబాబా ట్రస్ట్ ఒకదశలో నిర్ణయం కూడా తీసుకుంది. అటువంటిది సామాన్యునికి విమానయాన ప్రయాణాన్ని చేరువ చేయటంకన్నా దేశంలోని వీలైనన్ని గ్రామాలకు ప్రతీ రోజూ బస్సు సకర్యాలు కల్పించేందుకు ఏదైనా పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తే యావన్మంది ప్రజలకు ఎంతో మేలు చేసినవారౌతారు. రాజు గారు.. ఈ విషయాన్ని గురించి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడితో చర్చించండి సారూ..

click me!