త్వరలో రూ. 2 వేలు విలువతో నోట్లు

First Published Oct 23, 2016, 3:27 AM IST
Highlights
  • త్వరలో రూ. 2 వేలు విలువగలిగిన నోట్లు
  • ద్రవ్యోల్భణాన్ని తట్టకునేందుకే
  • నల్లధనం అదుపు ఎలాగ?

త్వరలో దేశంలోకి రూ. 2000 విలువ గలిగిన కరెన్సీ నోటు చెలామణి అవ్వనున్నది. అందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేసింది. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టాలంటే ప్రస్తుతమున్న కరెన్సీ విలువను మరింత పెంచటమే మార్గమని పలువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకునే ఆర్  బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.

  మైసూరులోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ఈ మేరకు నోట్ల ముద్రణ కూడా దాదాపు అయిపోవచ్చినట్లు సమాచారం. ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్భణం, మరోవైపు పేరుకుపోతున్న లక్షల కోట్ల రూపాయల నల్లధనం, ఇంకోవైపు నగదు రహిత లావాదేవీలను ప్రత్సహించే ఉద్దేశ్యంతో ఆర్ బిఐ ప్లాస్టిక్ మనీని చెలామణిలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే.

 ఇటువంటి నేపధ్యంలో కొత్తగా రూ. 2000 విలువ గలిగిన నోట్లను చెలామణిలోకి తేవాలన్న రిజర్వ్ బ్యాంకు నిర్ణయంపై నిపుణుల నుండి మిశ్రమ స్పందన కనబడుతోంది. ఒకవైపు నల్లధనాన్ని అదుపులోకి తేవటానికి మార్గాలను వెతుకుతున్న సమయంలోనే మరింత అధిక విలువగల నోట్లను తేవటం వల్ల నల్లధనం ఏవిధంగా నియంత్రణలోకి వస్తుందో కేంద్రప్రభుత్వమే చెప్పాలని నిపుణులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

   నల్లధనాన్ని అరికట్టాలంటే ప్రస్తుతం దేశంలో ఉన్న రూ. 1000, రూ. 500 విలువ గలిగిన నోట్లను తక్షణమే రద్దు చేయాలంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చంద్రబాబు లేఖ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోని కేంద్రం పైపెచ్చు మరింత విలువగల రూ. 2000 నోట్లను త్వరలో మార్కెట్ లోకి తేనుండటం గమనార్హం. నల్లధనాన్ని అరికట్టేందుకు దాదాపు నాలుగు దశబ్దాల క్రితం కూడా రూ. 10000 విలువగల నోట్లను రద్దు  చేసినట్లు నిపుణులు గుర్తు చేస్తున్నారు.

click me!