Indian Marriages: నిజానికి పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం. అది పెద్దలు కుదిర్చినా, ప్రేమించుకొని చేసుకున్నా.. కాని ఇటీవల ఇండియాలో పెళ్లి భారంగా మారుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెళ్లంటేనే.. ఎందుకబ్బా చేసుకోవడం అనే పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనుక కారణాలు, పరిష్కారాలు తెలుసుకుందాం రండి.
పెళ్లంటే వేద మంత్రాలు, పంచభూతాల సాక్షిగా మూడు ముళ్లు, ఏడడుగులు వేయడం అని అంతా అనుకుంటారు. ఆధ్యాత్మికంగా ఇది నిజమే అయినా పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి, అబ్బాయి అసలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా అని చాలా మంది పెద్దలు ఆలోచించరు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది.
ఇద్దరు వ్యక్తులు తమ జీవిత ప్రయాణంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని, ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనిస్తూ, చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోతూ జీవితాంతం కలిసి నడిచే బంధాన్నే పెళ్లి అంటారు. కానీ మన దేశంలో పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో అబ్బాయి, అమ్మాయి మనసులు కలవడం చాలా తక్కువ. ఒక అమ్మాయికి ఎవరో ముక్కు, మొహం తెలియని అబ్బాయితో పెళ్లి కుదిరితే వారిద్దరికీ ముందే రాసి పెట్టి ఉందని బలంగా నమ్ముతారు. పైగా ఇది ఇక్కడ ధర్మమని గట్టిగా నమ్ముతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఇదే విషయాన్ని నూరిపోస్తారు. ఇలాంటి పెద్దలు నిశ్చయించిన పెళ్లిళ్లలో ప్రేమ ఉండదు. బాధ్యతలు నిర్వర్తించడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవించేస్తారు.
భారతీయ సంస్కృతిలో ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే సమాజం సక్రమంగా, అభివృద్ధి దిశగా నడవాలని ముందుగానే ఒక విధానం క్రియేట్ చేశారు. అందులో భాగమే పెళ్లి చేసుకోవడం. పూర్వం పెళ్లి పెద్దలు కుదిర్చినా తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆనందంగా గడిపేవారు. కాని ఇప్పుడు కుటుంబ బాధ్యతల షేరింగ్ విషయమే పెద్ద సమస్యగా మారుతోంది. అమ్మాయి.. అబ్బాయి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవడం, వారితో కలిసి జీవించడానికి ఇష్టపడకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ఇక అబ్బాయి విషయానికొస్తే కుటుంబ అవసరాలకు తగ్గట్టు సంపాదించలేక, భార్య సంపాదిస్తుంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇవి చిన్నవే అయినా విడాకుల దాకా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్లలో కనిపిస్తాయి.
ఈ క్రమంలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సాంఘిక ఒప్పందాలుగా మిగిలిపోతుంటే, ప్రేమ పెళ్లిళ్లు అహంభావాలు, ఆధిపత్యపోరుకు బలైపోతున్నాయి. ఈ మధ్యలో పిల్లలు పుడితే వారి గతి మరింత భయంకరంగా మారిపోతోంది. పిల్లలను సక్రమంగా, మంచి నడవడికతో పెంచాల్సిన తల్లిదండ్రులే ఈగోలకు పోయి ప్రవర్తిస్తుంటే పిల్లలకు మాత్రం మంచి క్యారెక్టర్ ఎలా వస్తుంది.
ఇటీవల సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా ఫెయిల్ అవడానికి కారణాలు ఇవే. 1, 2 ఏళ్లకు విడాకులు తీసుకున్న వారు కొందరైతే, 20, 25 ఏళ్లు కాపురం చేసి కూడా విడిపోతున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఈ కారణాల వల్లే ఈ జనరేషన్ కి పెళ్లి అంటే భయం పుడుతోంది.
సామాజిక ధర్మాన్ని, కర్మ ఫలాన్ని నమ్మడంలో తప్పు లేదు. కానీ పెళ్లి చేసే ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ సిద్ధంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి. వాళ్లతో మాట్లాడాలి. ఇద్దరూ సిద్ధంగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కూడా అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ముందు కాస్త సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే సాంప్రదాయబద్ధంగా వారి వివాహం జరిపించాలి. ఒకవేళ పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఆ దిశగా కూడా మంచి, చెడులు ఆలోచించి పెళ్లి చేయాలి. వారి దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఇది కూడా చదవండి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఈ 8 విషయాలు అస్సలు మర్చిపోవద్దు!