పిల్లలు మంచి హెల్తీ ఫుడ్ నే తినాల. అప్పుడే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పిల్లల ఆరోగ్యం కోసం వారికి సాయంత్రం ఎలాంటి స్నాక్స్ ను ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది ఉదయాన్నే స్కూలుకు వెళ్లి సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తుంటారు. ఇలాంటి సమయంలో వారికి స్నాక్స్ ను ఇస్తే వారు తిరిగి ఎనర్జిటిక్ గా మారుతారు. అందులోనూ పిల్లలకు స్నాక్స్ అంటే చాలా ఇష్టం. స్నాక్స్ పిల్లల ఆకలిని తగ్గించడమే కాకుండా వారి శరీర ఎదుగుదలకు అవసరమైన పోషణను కూడా అందిస్తాయి. కాబట్టి పిల్లలకు సాయంత్రం ఎలాంటి హెల్తీ స్నాక్స్ ను ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రోటీన్ ఫుడ్
ఎదుగుతున్న పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం. అందుకే పిల్లలకు సాయంత్రం వేళ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే స్నాక్స్ గా ఇవ్వాలి. ఉదాహరణకు.. శెనగలు, చిక్కుళ్లు, వేరుశెనగ మొదలైనవి పిల్లలకు స్నాక్స్ గా పెట్టాలి. అలాగే పిల్లలకు స్నాక్స్ గా తీయని స్వాట్లను, స్నాక్స్ ను ఇవ్వకూడదు.
హెల్తీ కేక్
కేకులను పిల్లలు ఇష్టంగా తింటుంటారు. కానీ పిల్లల ఆరోగ్యానికి కేకు అస్సలు మంచిది కాదు. అందుకే మీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లో కేకులకు బదులుగా ఇంట్లో ఓట్స్ లేదా చిరుధాన్యాల పిండితో తయారు చేసిన కేకును పెట్టండి. దీనిలో చక్కెరకు బదులుగా తేనెను వాడండి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.
ఫ్రూట్ స్మూతీలు
పిల్లలు స్మూతీలు చాలా ఇష్టంగా తాగుతుంటారు. ఇవి మీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. అందుకే మీ పిల్లలకు పండ్లు లేదా కూరగాయల స్మూతీలను తయారుచేసి ఇవ్వండి. కానీ చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల స్మూతీలను మాత్రం పెట్టకండి. అలాగే వీటిలో చక్కెరను కలపకూడదు.
ఉడికించిన గుడ్లు
గుడ్లు మంచి పోషకాహారం. వీటిలో ప్రోటీన్లు, మంచి కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పిల్లలకు ఉదయమే కాకుండా సాయంత్రం కూడా స్నాక్స్ గా ఇవ్వొచ్చు.
నట్స్
నట్స్ పెద్దలకే కాదు పిల్లల ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి. నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అయితే పిల్లలకు నట్స్ ను ఎక్కువగా ఇవ్వకూడదు.
ఉడికించిన చిలగడదుంప
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మాన్ని కాపాడుతాయి. అందుకే మీరు మీ పిల్లలకు సాయంత్రం వేళ వీటిని ఉడకబెట్టి స్నాక్స్ గా ఇవ్వొచ్చు.