కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపేందుకు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి.. అధికారం చేపట్టిన రాజకీయ నాయకులు గురించి చర్చ సాగుతుంది. రాహుల్ యాత్ర కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుందని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి. మరి ఆ పాదయాత్రలను ఒకసారి పరిశీలిస్తే..
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపేందుకు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనుంది. దాదాపు 150 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు పలకరిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది.
కాంగ్రెస్‌లోని కీలకమైన నేతలను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడటం.. ఇతర పార్టీల్లోకి వెళ్లినవారిలో కొందరినైనా తిరిగి సొంత గూటికి తీసుకురావడం కూడా ఆ పార్టీ ముందు ఉన్న పెద్ద సవాలనే చెప్పాలి. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌లో ఎలా జోష్ నింపాలని.. వచ్చే మెరుగైన పనితీరు కనబరిచేలా వారిని ఎలా సన్నద్దం చేయాలని కూడా పరీక్షగా నిలిచింది. అయితే రాహుల్ పాదయాత్ర ద్వారా ఈ సవాళ్లను ఎదర్కొవడంలో రాహుల్ విజయం సాధిస్తాడనే ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఈ క్రమంలోనే 2014కు ముందు ఉన్న స్థితికి కాంగ్రెస్ చేరుకుంటుందా..?, రాహుల్ గాంధీ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటారా?, కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో భారీ జోష్ వస్తుందా? అనే ప్రశ్నలకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమాధానం దొరకనుంది. అయితే రాహుల్ పాదయాత్ర సాగుతున్న ఈ సమయంలో.. గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి.. అధికారం చేపట్టిన రాజకీయ నాయకులు గురించి చర్చ సాగుతుంది. సుదీర్ఘ పాదయాత్రలను చేపట్టి అధికారంలో వచ్చిన రాజకీయ నేతల గురించి చూస్తే..
మాజీ ప్రధాని చంద్రశేఖర్..
సోషలిస్ట్ నాయకుడు చంద్ర శేఖర్ 1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. నాలుగు నెలల్లో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4,200 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సమయానికి ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధ్యక్షునిగా మారారు. 1989 లోక్‌సభ ఎన్నికలలో చంద్ర శేఖర్, వీపీ సింగ్, ఇతరులు జనతాదళ్‌ను స్థాపించారు. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయిన తీరు చంద్ర శేఖర్‌కు ఇష్టం లేదు. ఎల్‌కే అద్వానిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో సమాజ్ వాదీ సమాజ్‌వాదీ జనతా పార్టీ/జనతాదళ్ (సోషలిస్టు) పేరుతో బయటి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో విజయం సాధించారు. అయితే ఆయన ఎనిమిది నెలల పాటే ప్రధానిగా కొనసాగారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆయన రెండు నెలల పాటు పాదయాత్ర చేపట్టారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా దాదాపు 1,500 కిలోమీటర్లు నడిచారు. తన యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను వింటూ ముందుకు సాగారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పాలనకు ముగింపు పలికారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో.. రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో.. ఆయన మరోమారు సీఎం అయ్యారు. అయితే ఆ ఏడాది రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా.. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు.. తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో చంద్రబాబు.. 2012 అక్టోబర్ 2న అనంతపురం జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో 208 రోజుల పాటూ 2,800 కిలోమీటర్లకు పైగా దూరం పాదయాత్ర కొనసాగింది. ఆ సమయంలో ఏపీ విభజన సమస్య ఉన్నప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రలో ప్రజల సమస్యల తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ఈ పాదయాత్ర తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో రాగా, నవ్యాంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్..
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్.. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయినా తన ఉనికిని చాటుకుంది. ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే తాను ఏపీ సీఎం కావాలని భావించిన జగన్.. తన తండ్రి మార్గాన్నే ఎనుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే 2017లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. బహిరంగ సభలు, ప్రజల సమస్యలు తెలుసుకోవడంపై దృష్టిసారించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
మాజీ సీఎం దిగ్విజయ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ 2017లో రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున 3,300 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. ఈ యాత్రను పూర్తిగా నాన్ పొలిటికల్ అని పేర్కొన్న దిగ్విజయ్ సింగ్.. మతపరమైన, ఆధ్యాత్మిక ప్రయత్నం అని చెప్పారు. ఆరు నెలల పాటు కొనసాగిన యాత్ర ద్వారా దిగ్విజయ్ సింగ్ ప్రజలకు కనెక్ట్ అయ్యే అవకాశం కలిగింది.
ఇక, 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో.. అక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అది ఎలా ఉన్నా.. దిగ్విజయ్ సింగ్ యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్‌ను, ఆయన సొంత రాజకీయ జీవితాన్ని పునరుద్ధరించింది.
రాహుల్ యాత్ర విషయానికి వస్తే..
రాహుల్ యాత్ర సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులో కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఐదు నెలల కాలంలో 3,700 కి.మీ మేర ఈ యాత్ర సాగనుంది. ఇప్పటివరకు రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ యాత్ర కొనసాగుంది. అయితే ఇప్పటివరకు సాగిన రాహుల్ యాత్రకు విశేష స్పందన వచ్చింది. తన ప్రసంగాల ద్వారా రాహుల్ జనాన్ని ఆకర్షించేలా చేస్తున్నారు. యాత్రలో చిన్నపిల్లలను, వృద్దులతో రాహుల్ వ్యవహరిస్తున్న తీరు పలువురిని ఆకట్టుకుంటుంది. కుండపోత వర్షంలో రాహుల్ ప్రసంగాన్ని కొనసాగిస్తే.. అక్కడి జనాలు కూడా ఎక్కడికి వెళ్లకుండా వర్షంలోనే ప్రసంగాన్ని విన్నారు. ఇక, తన తల్లి సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొనగా.. రాహుల్ ఆమెకు షూ లేస్ కట్టారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యతో కలిసి పాదయాత్రలో సరదాగా పరిగెత్తారు. ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే పాదయాత్ర ముగిసేసరికి రాహుల్ ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తాడు?, ప్రజలు ఆయనను ఎలా చూస్తారు?, కొత్త ఓటర్లను తనవైపుకు తిప్పుకుంటారా? అనేది కొన్ని నెలల్లోనే తేలిపోనుంది. అయితే పైన ప్రస్తావించిన కొన్ని పాదయాత్రలను గమనిస్తే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత కూడా పాదయాత్ర చేపట్టిన నాయకులకు కలిసివచ్చిందని గమనించాలి. అయితే ఇక్కడ 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ.. ప్రస్తుతం చాలా బలంగా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర ఏ విధంగా సహాయపడుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొవడానికి రాహుల్ ఎంచుకునే మార్గం, విధానాలు కూడా ఇక్కడ ఫలితంపై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.