RTC Strike: కేసీఆర్ నేర్పిన విద్యనే, కులం కాదు.. ఆకాంక్షనే

By telugu teamFirst Published Nov 6, 2019, 4:24 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె అవిచ్ఛిన్నంగా సాగుతున్న నేపథ్యంలో కుల చర్చ ముందుకు వచ్చింది. కేసీఆర్ మూడు డెడ్ లైన్లు పెట్టినా కార్మికులు అదరలేదు, బెదరలేదు. ఈ స్థితిలో ఆర్టీసీ కార్మికుల నాయత్వంపై మీద కుల చర్చ పెట్టడంలోని రహస్యమేమిటి..

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నెల రోజులు దాటింది. సమ్మె విరమణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటి వరకు మూడు డెడ్ లైన్లు పెట్టారు. ఒక్క డెడ్ లైన్ ను కూడా కార్మికులు ఖాతరు చేయలేదు. మూడో మంగళవారం అర్థరాత్రిని ఆయన డెడ్ లైన్ గా పెట్టారు. ఆ డెడ్ లైన్ లోగా విధుల్లో చేరిన కార్మికులు 300 మంది పైగా మాత్రమే ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు మొత్తం 49 వేల మందికి పైగా ఉన్నారు. అంటే విధుల్లో చేరిన కార్మికుల సంఖ్య లెక్కలోకి కూడా రాదు.

ఆర్టీసీ కార్మిక శక్తి యావత్తూ సంఘం నాయకత్వం వెంట ఉందని అర్థం. నిజానికి, ఆర్టీసీలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఆర్టీసీలో ఎక్కువ మంది ఉన్నారు. నాయకత్వం మాత్రం రెడ్ల చేతుల్లో ఉంది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాయకుల పక్కన ఇతర కులాలవారు లేరనే వాదన కూడా వినిపిస్తోంది. చెప్పాలంటే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలో నాయకత్వంలోకి రావాలని కోరుకోవాలి. అలా వచ్చేలా పరిణామాలను వేగవంతం చేయాలి. అయితే, ఆ చర్చ ప్రస్తుతం సమ్మె తీవ్రంగా సమయంలో అవసరమా అనేది ప్రశ్న.

Also Read: RTC Strike: ఇదేం వాదన, 'కులం' దొడ్డి దారిలో.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే, పక్కన కోదండరామ్ ఉన్నారు. అన్ని వర్గాల వారు ఆయన ఉద్యమానికి అండగా నిలువడమే కాదు, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో కులప్రస్తావన దాదాపుగా రాలేదనే చెప్పాలి. అంటే, ప్రజల ఆకాంక్షదే పైచేయి అయింది. ఉద్యమం నడుస్తున్న కాలంలో ఆకాంక్షకే పెద్ద పీట అవుతుంది. 

కార్మికులు సంఘటితంగా లేకపోతే నాయకత్వం కూడా ఏమీ చేయలేదు. అశ్వత్థామ రెడ్డి ఒక్కడు లేదా అయన చుట్టూ ఉన్న కొంత మంది సమ్మెను కొనసాగించలేరు. కార్మికుల సంఘటిత శక్తి కారణంగానే సమ్మె నడుస్తోంది. ఆ క్రెడిట్ దక్కాల్సింది కార్మికులకే. అశ్వత్థామ రెడ్డి కేవలం ఆలంబన మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఆలంబనగా మాత్రమే ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటే ప్రస్తుత ఆర్టీసీ సమ్మెను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. 

Also Read: RTC Strike: మెట్రోకు క్రాస్ సబ్సిడీ, ఆర్టీసీ ఏం చేసింది?

కార్మికులకు కొట్లాడాలని బోధనలు చేసినవారు కేసీఆర్. పండుగ అడ్వాన్స్ కోసం కూడా ఆర్టీసీ కార్మికులు కొట్లాడాలని కేసీఆర్ ఉద్యమ కాలంలో చెప్పారు. అందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడ్డారు కూడా. ఇప్పుడు ఆయన కొట్లాడొద్దు, ఇచ్చింది తీసుకోండి అని చెబుతున్నారు. పైగా, యూనియన్లు ఉండొద్దని చెబుతున్నారు. యూనియన్లే లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవడానికి, డిమాండ్లను సాధించుకోవడానికి యూనియన్లు ఊతకర్రలు. అవే లేకపోతే ఏం జరుగుతుందనేది తెలియంది కాదు. 

ఇకపోతే, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించడమంటే ఉత్సవ విగ్రహాలు చేసి వేదికల మీద కూర్చోబెట్టడమేనా? రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పెద్దలు అదే పనిచేస్తున్నారని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వర్గాల వారిని పక్కన కూర్చోబెట్టుకుని, అంతా తానై ఏకపాత్రాభియం చేసే నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read: RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే..

మొత్తం మీద, మూడు డెడ్ లైన్ల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నం కాలేదు కాబట్టి ఇతరేతర చర్చలు ముందుకు వస్తున్నాయా, సందర్భం వచ్చింది కాబట్టి కుల చర్చలు ముందుకు వస్తున్నాయా అనేది తేలాల్సి ఉంది. 

click me!