జగన్ అర్ధం కావడానికి ‘టైం’ అక్కర్లేదేమో ...

By telugu team  |  First Published Jun 20, 2019, 10:43 AM IST

జగన్ మోహనరెడ్డి స్వంతంగా పార్టీ పెట్టి రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు, కోస్తా జిల్లాల్లో అది రాయలసీమ ‘ఫ్యాక్షనిస్టుల పార్టీ’ అంటూ, దాని గురించి ప్రచారం చేయబడింది. అయితే అందుకు పూర్తిగా భిన్నమైన ధోరణిలో ఫ్లైట్ లో ఆ యువకుడు మాట్లాడుతున్నాడు.


జాన్ సన్ చోరగుడి
 
జూన్ ఏడు సమయం సాయంత్రం ఆరు అవుతూ వుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో విజయవాడ బయలు దేరుతున్న ‘స్పైస్ జెట్’ కౌంటర్ వద్ద మర్నాడు ఉదయం అమరావతిలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార సందడి! ఫ్లైట్  లోపల కొందరి పోన్లలో అవే సంభాషణలు. ఒక మధ్యవయస్కుడు నాజూగ్గా ప్యాక్ చేయించిన పండ్లబుట్ట పట్టుకుని ఫ్లైట్ లోపలి రావడానికి కింద క్యూలో కనిపెడుతున్నాడు. రాయలసీమ జిల్లాల వారికి దగ్గరలో వున్నవిమానాశ్రయం అది. 

అయితే విశేషం ఇవేవీ కాదు, అది-ఫ్లైట్లో వెనక సీటు నుంచి వినిపించిన మాటలు! ‘అడ్డ పంచెలు కట్టుకుని పంచాయతీలు చేయడం ఇక కుదరదు’ ఎవరో మరెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. విజయవాడలో దిగేప్పుడు అంటున్నాడు ‘మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి కన్ఫర్మ్ అయింది’ అని. గమనిస్తే వయస్సు ముప్పై ఉండొచ్చు, టైట్ ఫిట్ వైట్ షర్ట్, పి కలర్ ప్యాంట్; ఆపకుండా అలా ఫోన్ మాట్లాడుతూనే ఫ్లైట్ దిగాడు. మాటల మధ్యలో రూమ్స్ బుకింగ్, కార్లు అంటున్నాడు. ఆ హడావుడి అంతా బహుశా మర్నాడు ఉదయం అమరావతిలో జరిగే ప్రమాణ మంత్రుల స్వీకారానికి వెళ్ళడానికి కావచ్చు. 

Latest Videos

undefined

జగన్ మోహనరెడ్డి స్వంతంగా పార్టీ పెట్టి రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు, కోస్తా జిల్లాల్లో అది రాయలసీమ ‘ఫ్యాక్షనిస్టుల పార్టీ’ అంటూ, దాని గురించి ప్రచారం చేయబడింది. అయితే అందుకు పూర్తిగా భిన్నమైన ధోరణిలో ఫ్లైట్ లో ఆ యువకుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. విజయలక్ష్మి పోటీ చేసిన విశాఖపట్టణం లోక్ సభ స్థానంలో ఈ దుష్ప్రచారం అప్పట్లో చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. రాష్ట్రం విడిపోయాక, ఇక ముందు అందరం కలిసి జీవించవలసి ఉన్న మూడు ప్రాంతాలయిన- రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో ఒకరి  గురించి మరొకరు ఆనాడు వెదజల్లిన విద్వేషపు విత్తనాలవి. అయితే చిత్రం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించిన రాయలసీమ ఉత్తరాంధ్ర లోని ఏడు జిల్లాల్లో ఈ విశాఖపట్టణం కూడా వుంది! ఇదిలా వుంటే, రాష్ట్ర విభజన తర్వాత ఈ ఐదేళ్ళలో రాష్ట్రం గురించి యువతరం వైఖిరి, రాజకీయ నాయకుల ధోరణికి ఎంత భిన్నంగా ఉందో గమనించినప్పుడు, ఏ.పి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అదృష్టవంతుడు అనుకోవాలి.

జగన్ కేబినేట్ లో హోం మంత్రిగా శ్రీమతి సుచరిత నియామకం గురించి చూద్దాం. ఇటువంటి పదవులు- ఇదేమీ మొదటిసారి కాదు, అనే విమర్శకులకు మనకు కొదవలేదు. వాళ్ళు దాన్ని బాలయోగి దగ్గర నుండి మొదలు పెడతారు. ఇప్పుడు విషయం అదేదీ కాదు, అటువంటి కీలక పదవుల్లో పనిచేయడానికి అవకాశం వచ్చినవాళ్ళలో ఎందరు స్వతంత్రంగా తమ విధులు నిర్వహిస్తున్నారు? అనేది ఇక్కడ ప్రశ్న. శ్రీమతి సుచరిత తన కార్యాలయ చాంబర్ లోకి ప్రవేశించిన రోజున మీడియాతో మాట్లాడుతూ- ‘పోలీస్ శాఖలో త్వరలో ఒక గిరిజన, ఒక మహిళా పోలీస్ బెటాలియన్లు వస్తున్నాయి’ అని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఇటువంటి విధానపరమైన ప్రకటన ఒక్క  సి.ఎం తప్ప మరొకరు వెల్లడించే అవకాశమే లేదు! ఇక్కడే మునుపటికి భిన్నంగా జగన్ మనకు కనిపిస్తున్నాడు.   

జగన్ ప్రభుత్వం తనకు నచ్చిన కొత్త అధికార యంత్రాంగాన్నిఇప్పటికే ఎంచుకుంది, కొత్త మంత్రి మండలి కూడా కుదురుకుంది. ఆ కూర్పులో కూడా జగన్ తన వైవిధ్యాన్ని చూపించాడు. ఇక డిసెంబర్ చివరి నాటికి నూతన ప్రభుత్వ కార్యాచరణ ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళడం మొదలవుతుంది. ఎన్నికల వాగ్దానాల్లో కొన్ని అయినా ప్రజలకు చేరతాయి. అయితే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అవుతుంది, అని జగన్ మోహన రెడ్డి చేసిన ప్రకటన, కొత్త ఏడాదిలో సంక్రాంతి నాటికి గ్రామస్థాయిలో రచ్చబండ కబుర్లకు ప్రధానమైన విషయం అవుతుంది. చిత్రం ఏమంటే, ఎటువంటి “విజన్” లేకుండానే ఇదంతా 2020లో మొదలవడం! 

కొత్త జిల్లాలు తెలంగాణలో వచ్చాక మరి మన సంగతి ఏంటి అని, 2017 ఆగస్టులో సి.ఎం. ఆఫీస్ తో దగ్గరిగా వుండే ఒక జర్నలిస్ట్ ను ఒక అడిగినప్పుడు, ‘మన దగ్గర డబ్బులు ఎక్కడివి, అంటున్నారు’ అన్నాడు. అంతకు ముందు, ఇదే ప్రస్తావన బెజవాడలో ఒక మార్క్సిస్ట్ సాహిత్య పత్రిక సంపాదకుడు వద్ద ఎత్తినప్పుడు, ‘కొత్త జిల్లాలు వస్తే ఏమొస్తాయి చెప్పండి, ఆఫీసర్లకు ఉద్యోగాలు వస్తాయి, అంతేనా?’ అన్నారు. 

ఇటువంటి వాళ్ళకు ఎవరికైనా ఇప్పుడు అర్ధం కావలిసింది ఏమంటే, జగన్ రెడ్డి చేసిన మంత్రి వర్గం కూర్పుకు, రేపు జరగబోయే జిల్లాల విభజన ఒక సూక్ష్మస్థాయి కొనసాగింపు అవుతుంది. ఐదేళ్ళ క్రితం నాటికంటే, ఈ రాష్ట్రంలోని అన్ని సామాజిక పొరలు గురించి జగన్ కు ఇప్పుడు లోతుగా స్పష్టంగా తెలుసు. అది క్యాబినెట్ కూర్పులోనే కాదు, మొదటి నెలలోనే తీసుకున్నప్రజాప్రయోజన నిర్ణయాల్లో ప్రతిఫలించింది. నిజానికి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి గడచిన ఐదేళ్ళ నిరీక్షణ కాలం, జగన్ మోహనరెడ్డి అవగాహన పునాదులు దృడతరం కావడానికి అదనపు ‘క్యూరింగ్ టైం’ అయింది. ఆ విషయం ఆ పార్టీ వాళ్లకు కూడా ఇంకా పూర్తిగా అర్ధం అయినట్టు లేదు!

రాష్ట్ర విభజన జరిగాక ఒక పాత ప్రాంతీయ పార్టీ ప్రస్థానం నలభై ఏళ్లకు చేరువై, అది తన వ్యవస్థాపక అద్యక్షుడైన ఎన్.టి.ఆర్. ప్రాంతీయ స్పూర్తిని కోల్పోయి, చివరికి ఉప ప్రాంతీయ పార్టీగా రాజకీయ రంగం మీద నిష్క్రమిస్తున్నతరుణమిది. దాని స్థానంలోకి ప్రవేశించే నూతన ప్రాంతీయ పార్టీ తన మనుగడ కోసం సరికొత్త ‘సామాజిక ఖాళీలను’ వెతుక్కోవడం వాటిని పూరించడం అనివార్యం. అందుకు, పాత సరిహద్దులు దాటి మరీ  కంచెల్నితొలగిస్తేనే అది నిలదొక్కుకుంటుంది. ఇందుకోసం భవిష్యత్తులో అది ఇప్పుడున్న‘రిజర్వుడ్’ స్థానాల పరిమితిని కూడా తప్పనిసరైతే దాటవలసి రావొచ్చు కూడా ఇప్పుడు చెప్పలేం. 

కనుక నాయకుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం వొక సామాజిక అనివార్యతతో  తీసుకునే నిర్ణయాలకు, ఈ దశలో అవసరాన్ని మించిన కీర్తి కిరీటాలు పెట్టడం అస్సలు అక్కరలేదు. వ్యక్తిగతంగా జగన్ కూడా దాన్నికోరుకోక పోవచ్చు. అయితే, సామాజిక మాధ్యమాల్లో గత ఐదేళ్ళలో ఆవిర్భవించిన కొత్త ఒత్తిడి గుంపులు (ప్రెషర్ గ్రూప్స్) ఈ యువ ప్రభుత్వంపై తమ వైఖిరి ఏమిటో స్పష్టమైన స్టాండ్ తీసుకోవలసిన సమయమిది. ఎందుకంటే, ముందున్నకాలం మద్య వయస్కులది కాదు, అది ‘ఫ్లైట్’ లో కనిపించిన యువకుడి తరానిది. 

click me!