ఏపీ రాజగకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొత్త పంథాను పట్టాయి. పవన్ కల్యాణ్, జగన్, చంద్రబాబు సామాజిక వర్గాలను ఎత్తి చూపే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోడం ప్రారంభమైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పాత్ర తీసివేయలేనదనే విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు ఆధిపత్య సామాజిక వర్గాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసే సందర్భంలో ప్రత్యర్థుల కులాలను ప్రస్తావించేవారు కాదు.
తాజాగా, ఏపీ రాజకీయాల్లో నేతలకు సామాజిక వర్గం తోకలు తగిలిస్తున్నారు. వాటిని గట్టిగా ఒత్తి పలుకుతున్నారు కూడా. ఈ ఒరవడికి నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తారు. లేదంటే జగన్ అంటారు. కానీ, జగన్ రెడ్డి అని అనడాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వైసీపీ ఒకే సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడానికి ఆయన జగన్ రెడ్డి అని పలుకుతూ వచ్చారు.
undefined
దానిపై గతంలో వైసీపీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. అంతే కాకుండా అదే రీతిలో పవన్ కల్యాణ్ కు సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేశారు. పవన్ కల్యాణ్ ను పవన్ నాయుడు అని పలకడం ప్రారంభించారు తద్వారా పవన్ కల్యాణ్ సామాజిక వర్గాన్ని గుర్తు చేస్తూ వచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ విధమైన కుల ప్రస్తావనకు పూర్తిగా దూరంగా ఉండేవారు. కానీ ఆయన కూడా ఈ కొత్త పంథాను సొంతం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటూ వస్తున్నారు. ఈ మధ్య జరిగిన సభలో ఆయన ఆ విధంగా అని అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజిక వర్గ ప్రస్తావనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినప్పుడు టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కులాలను అంటగట్టడం సరి కాదని అన్నారు. అయితే, చంద్రబాబు కూడా ఈ కొత్త పంథాను అనుసరిస్తుండడంతో మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును కూడా తిప్పికొట్టడానికి అదే ధోరణిని అనుసరిస్తున్నారు.
చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని పలకడం సాగించారు. చౌదరి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ ఆయన సామాజికవర్గాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని సంబోధించారు.
వాస్తవానికి చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ సామాజిక వర్గాలు రహస్యమేమీ కాదు. వారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ప్రజలందరికీ తెలుసు. కానీ నాయకులు కొత్త ధోరణిని అవలంబించడం ద్వారా కొత్త రాజకీయ ప్రయోజనాలను పొందాలను చూస్తున్నట్లు కనిపిస్తోంది.