కూతవేటు దూరంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్: రాజధానిగా అమరావతి సేఫ్ కాదా...

By narsimha lode  |  First Published Aug 29, 2019, 6:39 PM IST

ఓడిస్సాలోని బాలసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి 150 కిమీ. దూరంలో వుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గుల్లలమోద వద్ద 260 ఎకరాల్లో మడ అడవుల మధ్య రాబోతున్న ఈ కొత్త కేంద్రం, ప్రతిపాదిత రాజధాని అమరావతికి 50 కి.మీ. ‘ఎయిర్ డిస్టెన్స్’ లోపు గానే ఉంటుంది. రేపు రాజధాని ఈ మిస్సైల్ కేంద్రానికి ఇంత తక్కువ దూరంలో ఉండడం, రక్షణ కోణంలో అది ఎంతమేర భద్రం అనే అంశం ఆయా రంగాల నిపుణులు మాత్రమే స్పష్టం చేయవలసిన అంశం.


- జాన్ సన్ చోరగుడి

ఎనభయ్యవ దశకంలో సుదీర్ఘకాలం విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యాక, ఇక ముందు మన విదేశీ విధానం- ‘లుక్ ఈస్ట్’ (తూర్పు చూపు) అన్నారు. ఆ తర్వాత వాజపేయి ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగించింది. అయితే తూర్పు ఆసియాదేశాల ‘జియో పొలిటికల్’ అనివార్యత, మరొక అడుగు ముందుకేసి ఇప్పుడు ‘యాక్ట్ ఈస్ట్’ ను అనివార్యం చేసింది. 

Latest Videos

undefined

దాంతో ఒకప్పటి యు.పి.ఏ. -2 తరహాలోనే కేంద్రంలోని ఎన్.డి.ఎ-2 కూడా ఆదిశలో మునుపటికంటే, మరింత చురుగ్గా వడివడిగా అడుగులు వేస్తున్నది. పి.వి. వారసుడు డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన పదవీ కాలం ముగిసే ముందు, దక్షణాదిన కాంగ్రెస్ పార్టీకి కలిగే రాజకీయ నష్టానికి కూడా వెరవక రాష్ట్రాన్ని విభజించి, ఆంధ్రప్రదేశ్ ను తీరాంధ్ర రాష్ట్రం చేసి, ‘పి.వి. తూర్పు చూపు’ కు మన్మోహన్ తొలుత మార్గం సుగమం చేసారు.

అయితే ఇప్పుడు మరో నాలుగు నెలల్లో మనం 2020 లోకి ప్రవేశించడానికి ముందు, ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ పర్యటన కోసం ముందస్తు సంసిద్దత కొరకు మన విదేశాంగ శాఖ మంత్రి డా. జై శంకర్ ఇప్పుడు మాస్కోలో ఉన్నారు. ఇక గత వారం దేశంలో తూర్పు తీర రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన రాష్ట్రంలోకి పెట్టుబడులు కోసం అమెరికాలో వున్నారు. ఏవో కారణాలతో వాయిదా పడింది గానీ, నిజానికి ఈనెల చివరి వారంలో (ఆగస్టు 26) దేశ రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ తూర్పుతీరాన ఆంధ్రప్రదేశ్ లో ఆ శాఖ అక్కడ నిర్మించనున్న రాకెట్ ప్రయోగ కేంద్రానికి (మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్) శంఖుస్థాపన చేయవలసివుంది.

అయితే ఇక్కడ మనం గమనించవలసింది, దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రావాలనుకున్న సమయానికి ఉన్న ప్రాధాన్యత గురించి. ఆగస్టు రెండవ వారం ఆయన దివంగత ప్రధాని వాజ్ పాయి ప్రధమ వర్ధంతి సందర్భంగా 1998 లో మొదటిసారి మన దేశం అణ్వస్త్ర ప్రయోగం చేసిన రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ వద్ద - ‘ముందుగా మేము దాడి చేయం’ అనే ఒకప్పటి మా అణ్వాయుధ విధానం, పరిస్థితులను బట్టి మారితే మారవచ్చు, అంటూ నర్మఘర్భ వ్యాఖ్యలు చేసారు. ఇది జరిగిన పదిరోజుల్లోనే దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మన తూర్పు తీరాన ఈ అణ్వాయుధ ప్రయోగ పరిక్షా కేంద్రం శంఖుస్థాపనకు రావాలనుకున్నారు. 

రాజనాథ్ సింగ్ ఏ.పి. సందర్శన వాయిదా పడింది గానీ, దానికి కొనసాగింపుగా జరగవలసిన మిగిలిన గొలుసు కార్యక్రమాలు అన్నీ యధావిధిగా కొనసాగుతూనే వున్నాయి. మాస్కో భారత రాయబార కార్యాలయాలో మంగళవారం (27.8.2019) డా. జై శంకర్ మాట్లాడిన అతి క్లుప్త సందేశంలోనే అంతా వుంది. “మారుతున్న ప్రపంచ పరిణామాలు కొత్త సవాళ్ళను వాటితో పాటుగా సరిక్రొత్త దృక్పధాలను మన ముందుకు తెస్తున్నాయి, ‘ఇండో-పసిఫిక్’ పాలసీ ఆ దిశలో ఇప్పుడు మన ముందుకొచ్చిన సరికొత్త దృష్టి” అన్నారు. 

గత ఏడాది చివరి నుండి మన విదేశాంగ శాఖలో ప్రత్యేకంగా ‘ఇండో- పసిఫిక్’ డివిజన్ పనిచేయడం మొదలయింది. అది ‘ఇండో-పసిఫిక్’ అయినా లేదా ‘ఆసియా-పసిఫిక్’ అయినా, నిజానికి ఇది మునుపటి మన ఆగ్నేయ-ఆసియా దృష్టి కంటే, మరింత విస్త్రుతమైన ‘జియో- పొలిటికల్’ విధానమే అవుతుంది. అయితే, ఇంత విస్త్రుతమైన అంతర్జాతీయ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా ‘పార్టీ’ అవుతున్నది అనేది ఇక్కడ మనకు కలిగే సందేహం. రక్షణ మంత్రిత్వ శాఖలో డిల్లీ కేంద్రంగా  పనిచేసే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ.) రూ.100 కోట్లతో ఆగ్నేయాన నిర్మించనున్న మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్ రాబోతున్నది.

ప్రతిపాదిత రాష్ట్ర రాజధాని అమరావతికి 50 కి.మీ. విమాన దూరంలో బంగాళా ఖాతం తీరంలో ఒకనాటి డచ్చి సెటిల్మెంట్ ప్రస్తుత కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద గ్రామం వద్ద దీన్ని నిర్మిస్తున్నారు. నిజానికి మెరైన్ పోలీస్ అకాడమీ కూడా ఇదే తీరాన రావలసి వుంది. కానీ, మిరియాల గ్యాస్ ఉపయోగించి అయినా సరే, రాష్ట్ర విభజన మాత్రం జరగనివ్వం, అంటూ అప్పట్లో మనవాళ్ళు చేసిన హంగామాసమయంలో, దాన్నికాస్త ఇక్కణ్ణించి గుజరాత్ పట్టుకుపోయారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షణాదికి జరిగే కేటాయింపులు మొదటి నుంచి కూడా తమిళనాడు, కేరళ తర్వాతే అవి మనదాకా వచ్చేది. అలా 22 ఏళ్ళ క్రితం తమిళనాడు వెళ్ళిన ‘నియోట్’ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ) విస్తరణ కోసం అక్కడ సముద్ర తీరాన అనువైన స్థలం దొరక్క నెల్లూరు జిల్లా వాకాడు వద్ద ఏ.పి. ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయిస్తే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంస్థకు 2014లో ఇక్కడ శంఖుస్థాపన జరిగింది. ఆ తర్వాత ఆరేళ్ళకు ఇప్పుడు ఇది రెండవది. 

అయితే శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తర్వాత, ఇది - తూర్పు తీరంలో రక్షణ రంగంలో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక భారీ రక్షణ ప్రాజెక్టు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వస్తున్న కొవ్వాడ అణు విద్యుత్తు ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద నూక్లియర్ పవర్ ప్లాంట్. ఇలా ఆంధ్రప్రదేశ్ తీరం దేశ సరిహద్దు రక్షణ దృష్ట్యా అతి కీలకమైన రాష్ట్రం అయింది. అప్పట్లో యు.పి.ఏ-2 లో రక్షణ మంత్రిగా ఉన్న ఏ.కె. అంటోనీ 2013 నాటికి, డిల్లీ ‘వార్ రూమ్’ వద్ద ఎంతటి ఉద్రిక్త పరిస్థితి ఉన్నా ఏ దశలోనూ తాను మాత్రం మీడియా ముందుకు రాకుండా, తను అధ్యక్షుడిగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన కొరకు ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ని ముందు పెట్టి మొత్తం విభజన కధ నడిపించారు.

దక్షణ భారతదేశంలో ఒక రాష్ట్ర విభజన, ఈదేశ తూర్పుతీర రక్షణ దృష్టితో జరగడం, అది అప్పటికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక అవసరం కనుక అయితే కావచ్చు కూడా. ప్రతి రాజ్యానికి తన ప్రాదేశిక రక్షణ కోణంలో తమవైన వ్యూహాత్మక అనివార్యతలు వుంటాయి. ప్రభుత్వంలో ప్రతిదీ బహిర్గతం కావాలని ఏమీ లేదు. డిల్లీలో అప్పట్లో షిఫ్ట్  వారీగా ‘వార్ రూమ్’ బీట్ డ్యూటీ చేసిన తెలుగు టి. వి. చానళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక దశలో  కేంద్ర మంత్రి వాయలార్ రవి – “రాష్ట్రాన్ని విభజించడం అంటే, దోసెలు వేయడం కాదు గదా...” అన్నది ఎందుకో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తు చేసుకోవలిసి వుంది.

రెండవ టర్మ్ బరాక్ ఒబామా 2012 నవంబర్ 12న ఎన్నికయ్యాక, అప్పటికి స్వేత భవనం ప్రోటోకాల్ సంప్రదాయాలు కూడా ఇంకా పూర్తికాకుండానే, 19న ఆసియా-పసిఫిక్ దేశాల సదస్సుకు ఆయన కంబోడియా వచ్చారు. కంబోడియా వచ్చిన మొదటి అమెరికా అధ్యక్షుడు - ఒబామా. ఆయన తనను తాను America’s first Pacific president అని ప్రకటించుకున్నాడు. అప్పట్లో అలా ఆగ్నేయ ఆసియాలో చురుగ్గా పావులు కదిపిన ఒబామా ‘ఆసియా పివట్’ విధానాన్ని; ట్రంప్ కూడా అంతే వేగంతో కొనసాగించి వుంటే, మనకు తూర్పున ఉన్న దేశాల్లో చైనా-అమెరికా ఆధిపత్య పోరు మన తూర్పుతీరాన ఇప్పటికే కల్లోల జలాలను మిగిల్చేది .

ఇది ఇప్పటిది కాదు 2013 జనవరి నాటి మాట. చైనా తన దక్షణ సముద్రతీరాన చేస్తున్న రక్షణ వ్యయం కారణంగా అక్కడ ఉన్న చిన్నచిన్న దేశాల మీద ఒత్తిడి పెరిగింది. అమెరికా దాన్ని  ‘క్యాష్’ చేసుకోవాలనుకుంది. ఆ దేశాలకు అది తన ఆయుధాలు అమ్మి అప్పటికే ఆర్ధికపరంగా ఎదురీదుతున్న పరిస్థితి నుంచి అది బయటపడాలనుకుంది. అప్పట్లో ఆ విషయం ఇలా బయటకు వచ్చింది. “వైట్ హవుస్ తన దృష్టిని ఫసిపిక్ వైపు మరల్చడం వల్ల, మన పరిశ్రమలకు మంచిరోజులు రాబోతున్నవి” అని అమెరికా ఏయిరో స్పేస్ ఇండస్ట్రీ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ ఫ్రెడ్ డౌనీ అన్నట్టుగా, అప్పట్లో ‘రాయిటర్’ రాసింది. 

ఈ అసోసియేషన్ అమెరికాలోని ఆయుధ తయారీ కంపెనీలు అన్నిటికీ ఇక్కడి మన సి.ఐ.ఐ. మాదిరిగా ఉమ్మడి వాణిజ్య వేదిక. ఆవ్యాసంలో ఇంకా – “ఆగ్నేయ ఆసియా దేశాలు అమెరికాతో చేసుకున్న ఆయుధ కొనుగోలు ఒప్పందాలు పెరిగాయని, అది 2012 లో 13.7 బిలియన్ డాలర్లుగా రికార్డు అయిందని, 2011 కంటే అది 5.4 శాతం ఎక్కువని” ‘పెంటగాన్’ అధికారిక లెక్కలు ఉటంకిస్తూ ఆనాటి ‘రాయిటర్’ వ్యాసం సాగింది.

ఈ గతం ప్రస్తావన అంతా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే, ఆసియాలో చైనా నమూనాను అనుసరిస్తున్న రెండవ పెద్ద దేశం మనదే. అటువంటప్పుడు ఫసిపిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల ప్రతిఫలనాలు చైనాతో పాటుగా మనమీద కూడా ఏదో ఒక స్థాయిలో వుండడం తప్పదు. జై శంకర్ చెబుతున్న ‘ఇండో-పసిఫిక్’ రీజియన్ ఎటు విస్తరించి వుందో ‘మ్యాప్’ లో చూస్తూనే వున్నాం.

అటువంటప్పుడు డిల్లీ సర్కార్ తన ‘ఆపరేషనల్ కన్వీనియన్స్’ కోసం రేపు ఏ ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ’ పేరుతోనో దక్షణాది ముఖద్వారం హైదరాబాద్ లో కూర్చోవడం కూడా మున్ముందు అనివార్యం అయితే కావచ్చు. అయితే, అప్పట్లో ఒబామా తర్వాత వచ్చిన అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాలానికి అమెరికా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. అమెరికా 2008 ఆర్ధిక సంక్షోభం నుంచి బయటకు రావడం కష్టమయింది. దాంతో ‘ఆసియాన్’ ఒప్పందం పసిఫిక్ కేంద్రిత ‘డిప్లమసీ’ రెండూ అమెరికా ఎజెండాలో చివరికి చేరాయి.  అలా జరిగకుండా ఉండివుంటే, నరేంద్ర మోడీ, అమిత్ షాలకు తమ ప్రభుత్వ మొదటి ఐదేళ్ళు, ఉత్తరాది రాష్ట్రాల్లో వారు తమదైన ‘దేశీయ’ (హోం శాఖ) విధానంతో పొద్దుబుచ్చే ‘లగ్జరీ’ అస్సలు కుదిరేది కాదు. అలా అప్పట్లో భారతప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతల్లో ఆగ్నేయ ఆసియా పటం మసకబారింది.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటికి పదేళ్లుగా అధికారానికి దూరమై, చివరికి తన రాజకీయ అవసరార్ధం తెలుగుదేశం ఎన్.డి.ఏ. తో కలిసింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వంతో పాటుగా, దక్షణ తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర నిర్లక్ష్యానికి గురైంది. ఎందుకీమాట అనడం అంటే,  ఈ లోటు బడ్జెట్ రాష్ట్రానికి, యు.పి.ఏ. ప్రధాని మన్మోహన్ సింగ్ తెచ్చిన విభజన చట్టంలో ప్రస్తావించినవి కాకుండా, మోడీ ప్రభుత్వం అదనంగా ఇచ్చినవి ఏవి చెప్పుకోదగ్గ స్థాయివి కాదు. 

ఇప్పటికీ రాష్ట్రం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్.డి.ఏ.2 లో కూడా ప్రత్యేక హోదా అంశం ఊగిసలాడే గోడ గడియారం లోలకం చందమే అయింది! చైనా ప్రతిపాదించిన ‘వన్ బెల్ట్-వన్ రోడ్’ ప్రతిపాదనకు మోడీ ప్రభుత్వం నుంచి వచ్చిన నులివెచ్చని ప్రతిస్పందన గమనించిన తర్వాత, చైనా తన మార్గం తను చూసుకుంది. అది ఇప్పుడు తమిళనాడుకు ఆగ్నేయాన శ్రీలంక పోర్ట్ అథారిటీ నిర్మించిన మహేంద్ర రాజపక్సే పోర్టు ( హంబన్ తోట పోర్టు) నిర్మాణానికి 85 శాతం పెట్టుబడి పెట్టి మన దేశానికీ దక్షణాన చైనా బలమైన స్థావరం ఏర్పాటుచేసుకున్నది. అలా తన ఓ.బి.ఓ.అర్. మెరైన్ మార్గంలో రవాణానౌకల ఇంధనం కోసం, తాను ఇక భారత పోర్టుల మీద అధారపడనక్కరలేదని చైనా చెప్పకనే చెప్పినట్లయింది.

మన తూర్పు తీరంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో పరిస్థితులు ఉద్రిక్తతలు ఇలా ఉండగా, ఇక్కడ మనకున్న క్షిపణి ప్రయోగ కేంద్రం ఓడిస్సాలోని బాలసోర్ ఒక్కటే. అది రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి 150 కిమీ. దూరంలో వుంది.  అయితే ఆంధ్రప్రదేశ్ లో గుల్లలమోద వద్ద 260 ఎకరాల్లో మడ అడవుల మధ్య రాబోతున్న ఈ కొత్త కేంద్రం, ప్రతిపాదిత రాజధాని అమరావతికి 50 కి.మీ. ‘ఎయిర్ డిస్టెన్స్’ లోపు గానే ఉంటుంది.

గత ప్రభుత్వం ఇప్పటివరకు చెబుతున్న బహుళ అంతస్తుల (టవర్స్) రాజధాని భవన సముదాయం రేపు ఈ మిస్సైల్ కేంద్రానికి ఇంత తక్కువ దూరంలో ఉండడం, రక్షణ కోణంలో అది  ఎంతమేర భద్రం అనే అంశం ఆయా రంగాల నిపుణులు మాత్రమే స్పష్టం చేయవలసిన అంశం. రాబోయే రోజుల్లో కేంద్ర- రాష్ట్ర సంబంధాల మీద, అంతకు మించి దేశ విదేశాంగ అవసరాల దృష్ట్యా, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల దృష్టి విస్త్రుత ప్రయోజనాలు కోరేది కనుక అయితే, ఇకముందు దక్షణ భారత దేశంలో ఏ.పి. మరింత క్రియాశీలం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

click me!