
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ కోడెల కు వారు ఫిర్యాదు చేశారు. బుధవారం వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు.. స్పీకర్ కోడెల శివప్రసాదరావుని కలిశారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అనర్హురాలిగా ప్రకటించాలని వారు కోరారు. తాజాగా పార్టీ ఫిరాయించిన రాజేశ్వరితోపాటు గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పీకర్ ని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, రక్షణ నిధి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్పీకర్ ని కలిసిన అనంతరం ఈ ఎమ్మెల్యేలంతా మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు.. కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. వారిలో నలుగురికి నిస్సిగ్గుగా మంత్రి పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఈనెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను ఇప్పటికే వైసీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే తాము అసెంబ్లీలో అడుగుపెడతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఎమ్మెల్యే రాజేశ్వరిని టీడీపీలోకి లాక్కోవడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.