
విదేశాలలో తనకు డబ్బు ఉందని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్యారడైజ్ పత్రాల లీకుల గురించి జగన్ ప్రస్తావించారు.
చంద్రబాబు నాయుడికి తాను 15రోజుల సమయం ఇస్తున్నానని.. విదేశాల్లో తనకు పైసా సంపాదన ఉందని నిరూపించినా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలా నిరూపించకపోతే చంద్రబాబు.. తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
తాను ఏదైనా మంచి కార్యక్రమం ప్రారంభించిన వెంటనే తనపై దుష్ప్రచారం మొదలుపెడతారని మండిపడ్డారు. తన వద్ద విదేశాల్లో దాచుకునేంత డబ్బు ఉంటే.. నంద్యాల ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవాడిని కాదని పేర్కొన్నారు.
జగన్ పాదయాత్ర మొదలై మూడు రోజులు కావస్తోంది. ఆయన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైన మొదటిరోజే విదేశాల్లో ఆస్తులు దాచుకున్న భారతీయులు అంటూ కొందరి పేర్లను ప్యారడైజ్ పేపర్లు విడదల చేశాయి. అందులో జగన్ పేరు కూడా ఉందంటూ కొన్ని పచ్చ పత్రికలు ప్రచురించడం మొదలుపెట్టాయి. ఇదే అదునుగా తీసుకున్న చంద్రబాబు,అధికార పార్టీ నేతలు, మంత్రులు జగన్ పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. జగన్.. అవినితీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు కూడా. ఈ పనామా, ప్యారడైజ్ పేపర్ల విషయంపై జగన్ తాజగా స్పందించారు. అవి నిజమని నిరూపించమని చంద్రబాబుకి సవాలు కూడా విసిరారు. జగన్ పాదయాత్ర విజయవంతం అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టారని వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.