
నవంబర్ ఆరు నుంచి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించనున్న వైసిపి నేత జగన్మోహన్ రెడ్డికి అనూహ్యమయిన ఆశీస్సులు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనను ప్రజల ముందు ‘ఎండగట్టేందుకు’ ఆయన ఆయన ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర, 2004 ఎన్నికల ముందు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలా ఉంటుందని, వైసిపిని అధికారంలో తెచ్చే సుడిగాలి అవుతుందని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు. ఒక్కమాటలో చెబితే, ఈ యాత్ర జగన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎక్కుబెట్టిన బ్రహ్మాస్త్రం. ఇది పూర్తిగా రాజకీయ యాత్ర. అయితే, ఈ రాజకీయ యాత్ర విజయ వంతం కావాలని ఈ రోజు ఆయన కు విశాఖ శ్రీ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వరస్వతి ‘విజయ కంకణం’ కట్టారు. ఈ రోజు తిరుమలలో జగన్ స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ స్వామీజీ ఆయనకు విజయకంకణం కట్టారు. ఇది అసాధారణమయిన చర్య. స్వామీజీ ప్రతిపక్ష నాయకుడిని ఆశీర్వదించడమంటే, జగన్ రాజకీయ యాత్ర ఉద్దేశం నెరవేరాలని అనుగ్రహించడమే. స్వరూపానందేంద్ర సరస్వతి ఇలా జగన్ కు మద్దతునీయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమయింది.
ఎందుకంటే, స్వరూపానందేంద్ర స్వామీజి తొలినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుని విమర్శిస్తున్నారు. చంద్రబాబు చీకటి పడ్డాక అంటే రాత్రి 7.27 నిమిషాలకు(జూన్ 8,2014) ప్రమాణం చేయడాన్ని కూడా స్వామీజీ తప్పు పట్టారు. ఈ ముహూర్తం సరయింది కాదని, విపత్కర పరిస్థితులు ఎదురువుతాయని వ్యాఖ్యానించారు. తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పేరును కూడా అమరావతిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకించారు. రాజధానికి బౌద్ధానికి సంబంధించిన పేరును ఎంపిక చేయడం, పర్యటలన్నీ కూడా బౌద్ధదేశాల చుట్టూ ఉండటాన్ని కూడా స్వామీజీ తప్పు పట్టారు. అంతేకాదు, అమరావతి శంకస్థాపనకు నిర్ణయించిన ముహూర్తం కూడా సరికాదని చెప్పారు. ఈ ముహూర్తాన అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసినందునే బిజెపి బీహార్ లో ఘోరంగా విఫలమయిందని స్వామీజీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ముహూర్తాన అమరావతికి వచ్చినందునే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద సిబిఐ కేసు విచారణ జరుగుతూ ఉందని కూడా స్వామీజీ చెప్పారు.
స్వామీజీ అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు నిజమేనా అని పించేలా, రాజధాని నిర్మాణం అంగుళం కూడా ముందుకు సాగడం లేదు.ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి (అక్టోబర్ 2015) రెండేళ్లు గడిచినా ఒక్క ఇటుక కూడా పడలేదు. కనీసం అమరావతి పాలన నగరానికి డిజైన్లు కూడా తుదిరూపం తీసుకోలేదు. అంతా రభస గానే ఉంది. జపాన్ మాకీ అసోసియేట్స్ వేసిన డిజైన్లు నచ్చలేదు. ఆయన్ని తరిమేశారు. ఇది అన్ ఫెయిర్ అని మాకీ సంస్థ పిర్యాదు చేసింది. తర్వాత దేశీయ డిజైనర్లు అన్నారు. ఆపైన లండన్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్ కు అప్పగించారు. ఆయన ఇచ్చిన డిజైన్ల మీద ముఖ్యమంత్రి పెదవి విరిచారు. ఫోస్టర్ కు సలహాలివ్వమని బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని లండన్ పంపారు. ఆతర్వత వచ్చే డిజైన్లు నచ్చలేదంటే రాజమౌళికి చెడ్డపేరు. అందువల్ల చచ్చినట్లు నచ్చాయని చెప్పక తప్పదు.ఇది వేరే కథ.
ఈ వ్యాఖ్యానాలతో స్వారూపానందేంద్ర స్వామీకి చంద్రబాబు వ్యతిరేక స్వామీజీ అని పేరు వచ్చింది. ఇలా ‘యాంటి చంద్రబాబు నాయుడు’ అయిన స్వామీజీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ యాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించి విజయకంకణం కట్టడం జగన్ అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంది. స్వామీజీ ఇలా రాజకీయా యాత్రకు కంకణంకట్టడం తెలుగుదేశం వర్గాలను కొంత కలవర పెట్టింది. ‘‘ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు ఉన్నారు. ఎన్నికంకణాలు కట్టినా, జనం జగన్ ని నమ్మరు. 2019లో టిడిపి ని గెలిపిస్తారు చూడండి,’’ టిడిపి అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. స్వామీజీ కంకణం కట్టడం అధికారికంగా కామెంట్ చేసేంత పెద్ద విషయం కాదని ఆయన ‘ఏషియానెట్’ వివరణ కోరినపుడు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ధోరణి రాష్ట్రానికి విపత్తులను తెస్తూ ఉందని హెచ్చరిస్తున్న స్వామీజీ తొలి నుంచి జగన్ ని విశ్వసిస్తున్నారు. జగన్ కు కూడా స్వామీజీ మీద బాగా గురి ఉన్నట్లుంది. ఎందుకంటే, 2015 జనవరి జగన్ విశాఖ పట్టణం వెళ్లి శారదా పీఠం సందర్శించి స్వామీజీ ఆశీస్సులు పొందారు (పై ఫోటో). అప్పటినుంచి అనేక విషయాలలో జగన్ శారదాపీఠం స్వామీజీ సంప్రదిస్తున్నారని, 2019 లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా తీసుకుంటున్నట్లే, అన్ని విషయాలలో జగన్ కు స్వామీజీ చేదోడు వాదోడుగా ఉన్నారని చెబుతున్నారు. జగన్ కు విజయకంకణం కట్టేందుకే స్వామీజీ ఈ రోజు తిరుపతి వచ్చారని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, యాత్రకు ముందు, యాత్రకు తర్వాత ఏడుకొండలవాడి దర్శనం తీసుకోవాలని సలహాఇచ్చింది కూడా స్వామీజీయే అంటున్నారు.