
అనంతపురం జిల్లా లో గుత్తి- పామిడి పట్టణాల మధ్య రామరాజు పల్లె అనే వూరుంది. ఈ వూరెపుడూ వార్తల్లో ఉండే వూరుకాదు. ఈ వూరికో విశేషముంది. ఇంతకాలం బయటికి పొక్కకుండా ఉన్న ఈ విశేషాం బయటకొచ్చింది. ఆవూర్లో ప్రజలకు రెండు పేర్లు తప్ప మూడో పేరు లేదు. మగవాళ్లంతా ముత్యాలయ్యలయితే, మహిళలంతా సుంకులమ్మలే...
శ్రీనగర్- కన్యాకుమారి వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారి ఆనుకునే రామరాజుపల్లె ఉంటుంది. గ్రామంలో 350 ఇళ్లుంటాయి. ఇక్కడ జనాభా 1,500. వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో చాలా పేరున్న సుంకులమ్మ, ముత్యాలయ్య ఆలయాలు ఉన్నాయి. ఇవి చాలా పురాతనమయిన గుళ్లు. చాలా మహిమ ఉండే ఆలయాలని గ్రామప్రజల విశ్వాసం. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా అమ్మవారికి మొక్కుకుంటే వాళ్ల నమ్మకం.అందరిది ఒకటే మొక్కు. తమ ఇంట ఆడపిల్ల పుడితే సుంకులమ్మ అని, మగ పిల్లలు పుడితే ముత్యాలయ్య అని పేరు పెడతామని దేవతకు , దేవుడికి మొక్కుతారు. పాటిస్తారు. అందుకే ఊరంతా సుంకులమ్మలు, ముత్యాలయ్యలే ఉన్నారు. ఒక ఇంటిలో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికీ ఇవే పేర్లు ఉంటాయి. ఇలా గ్రామంలోని సగం మందికి ఈ తరహా పేర్లు ఉన్నాయి. ఈవూరొకసారి విజిట్ చేయాల్సిందే. జాతీయ రాహదారి మీద ఉందికాబట్టి రావడం సులభం. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్నపుడు గుత్తి తర్వాత పామిడి అనే వూరొస్తుంది. పామిడికి ముందు రామరాజు పల్లె వస్తుంది.