
తెలంగాణ టీడీపీ పరిస్థితి అద్వాన్నంగా మారిపోయింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు.. పార్టీని వీడి గులాబి కండువాను కప్పుకున్న సంగతి మన అందిరకీ తెలిసిందే. అయితే.. తాజాగా మరో కీలక నేత పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఎవరో కాదు.. టీడీపీలో ముఖ్య నేతగా వెలుగుతున్న నామా నాగేశ్వరరావు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఢోకా లేదు. అక్కడ అధికారంలోకి ఉంది కాబట్టి.. వైసీపీ, కాంగ్రెస్ నేతలు వచ్చి టీడీపీ లో చేరుతున్నారు. కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి వేరు. అధికారంలోకి రావడం పక్కనపెడితే.. అసలు ఇలాంటి పార్టీ ఒకటి ఉంది.. వారికి మనం ఓటు వేయాలి అనే విషయాన్ని కూడా ప్రజలు పూర్తిగా విస్మరించారు. అందుకు నిదర్శనమే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు .అలాంటి పార్టీని ఇంకా పట్టుకొని వేలాడితే.. తమకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు అని ఆలోచించిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ ఫిరాయించేశారు. అదే ఆలోచనలో నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారని సమాచారం. పుసుపు కండువాను పట్టుకొని కూర్చుంటే లాభమేమి ఉండదని భావించిన నామా.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే తన కార్యకర్తలతో కూడా చర్చించినట్లు టాక్..
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తోన్న నామా.. తాజాగా ఖమ్మం ఎంపీ పరిధిలో టీడీపీ పరిస్థితిపై సర్వే చేయించాడట. ఆ సర్వేలో టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని రిపోర్ట్ వచ్చిందట. అయితే వ్యక్తిగతంగా నామాకు మంచి మార్కులే వచ్చాయట. దీంతో ఆయన టీడీపీ కంటే తెలంగాణలో పుంజుకుంటోన్న బీజేపీలోకి వెళితే ఫ్యూచర్ ఉంటుందని భావించి ఆ పార్టీలోకి జంప్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆయన పార్టీ మారేందుకు బీజేపీ తప్ప మరో ఛాన్స్ కూడా ఏమీ కనపడటం లేదు. టీఆర్ఎస్ లో చేరదామంటే.. అందులో ఇప్పటికే నామా బద్ద శత్రువు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి అసలు పడదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితో తనకు కూడా బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. బీజేపీ కూడా తెలంగాణలో పెద్దగా మంచి నేతలు ఎవరూ లేరు. నామా లాంటి వారు వచ్చి చేరితే వారికి లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే నామాను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ పరిచేందుకు రెడీ అవుతారనే చర్చ సాగుతోంది.