
సీపీఐ నేత నారాయణ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆదివారం విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19మంది మృత్యువాతపడ్డారు. కాగా, మృత్యుల్లో నారాయణ సోదరి లలితమ్మ కూడా ఉన్నారు. లలితమ్మ.. ఆమె కుటుంబసభ్యులతో కలిసి పడవలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లలితమ్మ మృతదేహం లభించగా.. ఆమె కుటుంబసభ్యులు మరో ఇద్దరి ఆచూకీ తెలీలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం నారాయణ భార్య, పలువురు బంధువులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
బోటు ప్రమాదంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.