
రిజర్వేష్ల అమలు తీరుపై జయప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. రిజర్వేష్లలో బాగా స్థిరపడిన కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఎవరికి అవసరమో, ఎవరికి అనవసరం అన్న విషయంలో తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టి మరీ స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలకు, సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నవారికి రిజర్వేషన్లు ఎత్తివేయాలని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కలాశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. పలు అంశాల గురించి చర్చించారు. జనరల్ కేటరిగి కులాల్లో ఆర్థికంగా అణగారిన కుటుంబాలకు బోనస్ మార్కులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకొని తోటి విద్యార్థులతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. అలాకాకుండా ఉద్యోగాల్లో, ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్లు అడగటం దారుణమన్నారు. ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అడిగితే.. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కులాల ఆధారంగా ఉన్న రిజర్వేషన్లు ఎత్తివేయమని డిమాండ్ చేయటం సమంజసం కాదన్నారు. ఆర్థికంగా కోటీశ్వర్లు, ఉద్యోగాల పరంగా ఉన్నత హోదాలో ఉన్నవారే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు.