
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన పాదయాత్రకు మద్దతుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వంగవీటి రాధాకృష్ణ శనివారం సాయంత్రం నగరంలోని రెడ్ సర్కిల్ ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానుల నడుమ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర గిరిపురం, మొగల్రాజపురం, వాటర్ రోడ్డు ట్యాంకు మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకు సాగింది.
ఆయన గిరిపురం, న్యూగిరిపురంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను వాకబు చేశారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకం గురించి ఆయన వారికి వివరించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు రెడ్ సర్కిల్‌లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ యాత్రలో కార్పొరేటర్‌లు చోడిశెట్టి సుజాత, అవుతు శైలజ, చందన సురేష్, పల్లెం రవికుమార్, మద్దా శివశంకర్, కావటి దామెదర్, డివిజన్ నాయకులు తోకల శ్యామ్, గాంధీ కో- ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ తాడంకి శ్యామ్‌కుమార్, పాల భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.