కర్నూలు దగ్గిర రాలిన ఇండోనేషియా అగ్నిపర్వత బూడిద

First Published Dec 30, 2016, 5:12 AM IST
Highlights

74,000 సం. కిందట ఇండోనేషియాలో  తోబా అగ్నిపర్వతం పేలడానికి ముందే అధునిక మానవుడు ఆప్రికానుంచి భారత్ లోకి వచ్చాడనే   ఆనవాళ్లు కర్నూలు జిల్లాలో కనిపించాయి

ఆది అంతాలు తెలియని భువనం ఇది.దానిలో రవ్వంత భూమి మనది.అనంత కాలవాహినిలో అనేక మార్పులు. ఒకనాడు ఏకంగా ఉన్న భూమి ఖండాలుగా విడిపోయింది..ప్రాణికోటి చలనమూ మొదలై భూమంతటా వ్యాపించింది.ఈ ప్రాణికోటిలో మనమూ ఒకరం...వేల ఏళ్లలో ఎన్నో పరిణామాలు...ప్రకృతిలో మార్పులను అనుసరించి మానవుని జన్యువులకు సంబంధించీ ఎన్నో పరిణామాలు జరిగాయి...డార్విన్ చెప్పిందీ అదేగా..బలవంతులదే మనుగడ అని...ప్రకృతిని అనుసరించి మార్పుచెందని మహాకాయాలు రాక్షసబల్లులే నశించిపోయాయి...ప్రకృతికి ఎదురొడ్డి నిలిచి జీవనయానం చేస్తున్న మానవుల పరిణామం,పుట్టుపూర్వోత్తరాల గురించి అధ్యయనం చేయడానికి మానవశాస్త్రాన్నే తయారు చేసుకుని అధ్యయనం చేస్తున్నాము....ఈ శాస్త్రంలో ఒక చిన్నపుట ఈ వ్యాసం.

 

సుమారు 75,000 ఏళ్ల క్రితం ప్రస్తుతం ఇండోనేషియా లో తోబా సరస్సుగా పిలవబడుతున్న ప్రాంతంలో ఒక భారీ అగ్నిపర్వతం విస్పోటనం జరిగింది.దీనివల్ల 7.7 ట్రిలియన్ టన్నుల లేక 650 ఘనపు మైళ్ల శిలాద్రవం వెదజల్లబడింది.ఇంతవరకు జరిగిన భారీ అగ్నిపర్వత విస్పోటనాల్లో ఇదొకటైనందున దీన్ని తోబా విపత్తుగా పిలుస్తారు.భూమి,సూర్యుడి మధ్య పొరలా ఏర్పడ్డ బూడిదవల్ల భూమి మీద 6-10 సంవత్సరాలపాటూ ఉష్నోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి.దీని ప్రభావం అధిగమించి సామాన్య పరిస్థితులు రావడానికి మరో 1000 ఏళ్లు పట్టింది.

 

 

మొత్తానికి ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ బూడిద దక్షిణ ఆసియా ఖండమంతటా 6 ఇంచులు/15 సెంటీమీటర్లు పరచుకుంది.భూమ్మీదే కాకుండా హిందూ మహా సముద్రం,అరేబియా,దక్షిణ చైనా సముద్రాల్లోనూ ఈ బూడిద అవక్షేపాలు నిలిచిపోయాయి.

 

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం యాగంటి కి అతిచేరువలో ఉన్న గ్రామం జ్వాలాపురం.అగ్నికి సంస్కృత శబ్దం జ్వాల పేరుమీదుగా ఆ గ్రామానికి ఆ పేరొచ్చిందని కొందరంటే మరికొందరు జోల అనే కన్నడ పదం ఆధారంగా వచ్చిందంటారు.జోల కు అర్ధం జొన్నలు.ఆ ఊరొప్రత్యేకత అంటారా? 75,000 ఏళ్లక్రితం సంభవించి దక్షిణ ఆసియా అంతా పరచుకున్న తోబా అగ్నిపర్వత విపత్తునాటి బూడిద అవక్షేపాలక్కడ కనిపిస్తాయి.ఇక్కడ తవ్వకాలు జరిపిన శాస్త్రవేత్తల ద్వారా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి.

 

జుర్రేరు లోయగా పేరున్న ఇక్కడి భూమిపొరల్లో తోబా అగ్నిపర్వత కాలం కంటే ముందునాటి మానవ ఆవాసాలుండేవని,ముందు అనుకున్నట్లు విపత్తు తర్వాత ఇక్కడి మానవాళి నాశనం కాలేదనీ తెలుస్తోంది.ఈ బూడిద పొరలకు ముందు,వెనుక కాలాల్లో దొరికిన ఆదిమానవుల పనిముట్లు ఒకేలా ఉన్నాయి.శకలాలుగా దొరికిన పనిముట్లను జతచేసి చూస్తే అదే కాలం లో ఆఫ్రికా ఆదిమానవులు వాడిన పనిముట్లను పోలి ఉన్నాయి.ఇలాంటి పనిముట్లు,చిన్న ఆయుధాలు కర్నాటకలోని మలప్రభ పరీవాహక ప్రాంతంలోనూ కనిపించాయి.  

 

కానీ జ్వాలాపురంలో ఆనాటిమానవులకు సంబంధించిన ఏలాంటి ఆధారాలు,అంటే కంకాళాలు,ఎముకలు,పుర్రెలు లాంటివేవీ లభించలేదు.దానివల్ల మానవపరిణామ క్రమంలో ఏ జాతి ప్రజలు(ఉదా-నియాండర్తల్,హోమో ఎరక్టస్,హోమో హాబిలిస్,ఆస్ట్రలోపితికస్) ఆవాసం ఉండేవారన్నది తెలుసుకోలేకపోయారు.ఈ తోబా విపత్తు జరిగిన సమయంలో ఈ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడ్డ మానవజాతి ఇండోనేషియా లోని ఫ్లోర్స్ లో ఉండేదని పరిశోధకులు తేల్చారు.అంటే జ్వాలాపురంలానే ఉన్న వారి పనిముట్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. 

 

ఫ్లోర్స్ సమీపంలో ఆ తర్వాత కాలంలో శాస్త్రవేత్తలకు మానవుల అస్థికలు దొరికినా, పడమరగా ఉన్న ఒక గుహలో సెప్టంబర్ 2003 లో దొరికిన సుమారు 30 ఏళ్లున్న యువతి అస్థిపంజరం ద్వారా కొన్ని నిర్ధారణలకు రాగలిగారు...అప్పటి జనం 1మీటర్/3 అడుగుల ఎత్తులో ఉండేవారు.వీరి మెదడు పరిమాణం 380 ఘ.సెం.మీ ఉండేదని నిర్ధారించారు...హోమోసేపియన్లకుండే 1400 ఘ.సెం.మీ లలో మూడో భాగానికన్నా తక్కువ అంటే చింపాంజీకన్నా తక్కువ పరిమాణం మెదడు ఉండేది.కార్బన్ డేటింగ్ ద్వారా వీరు 18,000 ఏళ్లకు పూర్వం నివసించేవారని తెలిసింది.

 

ఫ్లోర్స్ లో దొరికిన ఈ మానవజాతికి "హోమోఫ్లోరెసియన్సెస్" (Homo floresiensis)అనే పేరును నిర్ధారించారు.

ప్రస్తుత మన జాతి హోమోసేపియన్స్ మూలాలకు(అస్ట్రలోపితికస్, హోమోహాబిలిస్...) ఈ మరుగుజ్జుల హోమోఫ్లోర్సియన్సెస్ కు మూలాలు ఒక్కటే అయినా మనజాతి అయిన హోమోసేపియన్స్  ముందుకు సాగిపోయాము,నిలిచిన ఈ మరుగుజ్జుల ప్రయాణం అంతమైంది.మనను,వారిని వేరుచేసిన కాలం,కారణాలు ఒక "మిస్సింగ్ లింక్"గా మిగిలిపోయింది.  

 

2016 లో జరిగిన పరిశోధనల ద్వారా ఈ మరుగుజ్జులు తోబా విపత్తుకంటే 50,000 ఏళ్ల ముందు నుంచి ఉండేవారని తెలిసింది..

 

ఈ మరుగుజ్జులకు "లార్డ్ ఆఫ్ ద రింగ్స్ " నవల ఆధారంగా "హాబిట్" అనే పేరుపెట్టారు.

 

మానవ సమూహాలు ఆఫ్రికా నుంచి వలసవచ్చి వివిధప్రాంతాల్లో స్థిరపడటం ఒకేసారి జరిగిందని అనుకునేవారు కానీ ఈ ఇండొనేషియా,జ్వాలాపురం పరిశోధనల వల్ల యూరప్ కంటే ముందు 30,000 ఏళ్ల క్రితమే జనం ఆసియా లో సంచరించారని తెలియవచ్చింది.మరో సిద్ధాంతం ప్రకారం ఇండోనేషియాలో 46,000 ఏళ్ల క్రితం మానవ సంచారం గురించి తెలిసింది...ఈ మరుగుజ్జుల అదృశ్యం వెనకాల యుద్ధాలు,నరమాంస భక్షణ మొదలైన కారణాలూ ఉండవచ్చు.

 

ఈ బూడిద రాశులు ఇతరప్రాంతాల్లోనూ కనిపించాయి.ఉదాహరణకు కడపజిల్లాలోని పోరుమామిళ్ల సమీపానున్న లింగమయ్యకొండ.ఈ ప్రాంతంలో ఆ మధ్య కొన్ని కట్టడాల కోసం తవ్వుతుంటే చాలా మరుగుజ్జు కంకాళాలు బయటపడ్డాయి.

 

ఆక్స్‌ఫర్డ్ నుంచి గుల్బర్గా విశ్వవిద్యాలయం వరకు ఎందరో జ్వాలాపురంలో పరిశోధనలు జరిపారు.ఒకసారి ఈ శాస్త్రవేత్తలు ఈ లింగమయ్యకొండలో పరిశోధనలు జరిపితే మనలను,మరుగుజ్జులను వేరు చేసిన మిస్సింగ్ లింక్స్ కు జవాబులు దొరకవచ్చని ఈ వ్యాస రచయిత అభిప్రాయం.

click me!