అమరావతిలో ‘ఇండియన్ డిస్నీ పార్క్’

First Published Jun 10, 2017, 8:22 PM IST
Highlights

అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమోమో చేయాలనుకుంటున్నారు. సకల సంతోషాల, వినోదాల, అందాల నగరంగా మార్చాలనుకుంటున్నారు.అక్కడే ఇండియన్ డిస్నీపార్క్ ఏర్పాటుచేయాలనుకుంటున్నారు.ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి.

2050 నాటికి అమరావతి 15 లక్షల  ఉద్యోగాలను అందిస్తుంది. రూ.120,000 కోట్ల సమాన జీడీపీ అందించే మెట్రో నగరంగా రూపొందుతుంది. అమరావతి చుట్టూ 9 నగరాలుంటాయి, వాటిని కలిపేస్తూ హ్యాపీ సర్కిల్  ఏర్పాటువుతుంది. అసలు అమరావతి నగరంలో ఆనందపురం.  ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు కలగంటున్న అమరావతి. శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ముఖ్యమంత్రి రాజధానిలో నిర్మిస్తున్న రహదారులు, పరిపాలన, విద్యా నగరాల పురోగతిని సమీక్షించారు. అపుడు ఆయన చెప్పిన మాటలివి.

 

అమరావతిలో వినోదానికి పెద్దపీట వేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడల కోసం అనేక ఆప్షన్లు వుండాలని చెప్పారు. ఆయనకు తగ్గట్టుగానే, చంద్రబాబు నాయుడు ఆలోచనలకు  1994 నుంచి ప్రాణం పోస్తున్న మెకిన్సే ఒక తాళమేసింది. అమరావతిని ఒలింపిక్స్ బంగారు పతకాల ఖార్ఖానాగా రూపొందించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దీనిని  మెకిన్సే  వివరంగా చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతిలో ఏర్పాటయ్యే ప్రతి భవంతికి సొంతంగా విద్యుత్ సమకూర్చుకునే వ్యవస్థ ఉండాలి. నీటిని పునర్ వినియోగానికి ఉపయోగించుకునే ఏర్పాటు వుండాలి. నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే తిరిగేలా అమరావతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్ రూపొందించాలని సీఆర్ డీఏను ఆయన ఆదేశించారు.అమరావతిలో ఏర్పాటవుతున్న ఏ విశ్వవిద్యాలయానికి కాంపౌండు వాల్స్ వుండవని, నగరంలో భాగంగా వుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికే కాంపౌండ్ వాల్ లేకుండా యూనివర్శిటీలను ఉంచాలన్న నిర్ణయానికి వచ్చామని అన్నారు. విద్యా సంస్థలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రం.. ఇలా అన్నీ ఓపెన్‌గానే వుంటాయన్నారు.

‘ఇండియన్ డిస్నీవరల్డ్’గా శాఖమూరు పార్క్

అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూపొందించిన శాఖమూరు పార్క్ పై ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి సీఎండీ లక్ష్మా పార్ధసారధి ప్రెజెంటేషన్ ఇచ్చారు. 250 ఎకరాలలో ఏర్పాటు చేసే ఈ పార్కు నగరానికి ప్రధాన ఆకర్షణ కాగలదని ఆమె చెప్పారు. ఇందులో సాహస క్రీడలు, జల  క్రీడలు, అంతర్జాతీయస్థాయి ఉద్యానవనాలు, మ్యూజిక్ ఫౌంటేయిన్, వాటర్ ఫాల్స్, బటర్ ఫ్లై పార్క్, రిసార్టులు, హోటళ్లు, షాపింగ్ కేంద్రాలు, ధియెటర్లు.దీన్ని ఇండియన్ ‘డిస్నీ వరల్డ్’గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

అమరావతిని సంతోష నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ సంస్థ మెకన్సీ ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ అందించింది. ముఖ్యంగా అత్యున్నత విద్యా వసతుల ద్వారానే అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ పెంచగలుగుతామని పేర్కొంది. ఎకనామిక్ డెవలప్‌మెంట్, సోషల్ వెల్ బీయింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, గవర్నెన్స్ అండ్ సస్టెయినబులిటీ మొదలైన 5 అంశాలతో అమరావతిని సంతోష నగరంగా మార్చవచ్చునని సూచించింది.

యుఎఇలో మస్దార్ ఫ్యూచిరిస్టిక్ సిటిని ప్లాన్ చేసిన నార్మన్ అండ్ ఫోస్టర్ అమరావతి పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ దాదాపు పూర్తిచేసిందని , వచ్చే వారంలో దీనిని ప్రభుత్వానికి అందజేస్తామని వారు చెప్పారని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు.

 

 

click me!