మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకిలా అయిపోయాడబ్బా!?

First Published Nov 17, 2017, 1:33 PM IST
Highlights

చిన్న వయసులోనే ముఖ్యమంత్రయ్యాడు. ఒక చిన్న గ్రూప్ కో, ఒక  పెద్ద ముఠా కో నాయకుడు కాకుండా  ముఖ్యమంత్రి అయిన తెలుగు రెడ్డి ఈయనే. మనిషిగా ఏకాకి.రాజకీయంగా ఏకాకి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు కూడా ఒక వర్గం తయారు చేసుకోలేకపోయాడు. ఏకాకిగానే  పదవి దిగిపోయాడు.

తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో అతి తొందరగా కనుమరుగయిన వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రిగా దాదాపు మూడేళ్లున్నా, పదవి పోయిన మరుక్షణమే ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఏమిచేస్తున్నాడో తెలియదు. మనిషి లేడు, మాట లేదు.అలుకు లేదు పలుకు లేదు. పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. అయితే, కుటుంబం పేరు తప్ప ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందేమీ లేదని పిస్తుంది. గెలిచింది కూడా రాజశేఖర్ రెడ్డి వల్లనే అని కూడ  చాలా మంది చెబుతారు.  సొంత బలమనేది లేనందున మూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా రాజకీయాల్లో ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాడు.

ఆమధ్య బిజెపిలోకి వెళ్తున్నాడన్నారు. ఎందుకో బిజెపి ఆయన మీద పెద్దగా ఆసక్తి చూపనేలేదు. ఇక ఆయనకు ధీటయినా పార్టీ దొరకలేదు. దొరక్కపోయేందుకు కారణాలున్నాయి. అయన అకాలంగా ముఖ్యమంత్రయ్యాడు. కాంగ్రెస్ రాజకీయాల్లోని గమ్మత్తు అదే. ఎవరు ఎపుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎపుడు మాయమవుతారో తెలియదు. మహారాష్ట్రలో చూడండి ఎంతమంది ముఖ్యమంత్రులయ్యారో. వాళ్లంతా ఇపుడెక్కడున్నారో తెలియదు. అలాంటి శనే కిరణ్ కు పట్టుకున్నట్లుంది. చిన్న వయసులోనే ముఖ్యమంత్రయ్యాడు. ఒక గ్రూప్ , ఒక ముఠాకు నాయకుడు కాకుండా ఉంటూ ముఖ్యమంత్రి అయిన తెలుగు రెడ్డి ఈయనే. మనిషిగా ఏకాకి.రాజకీయంగా ఏకాకి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు కూడా ఒక వర్గం తయారు చేసుకోలేకపోయాడు. ఏకాకిగానే వెళ్లిపోయాడు. అయితే, ఉనికియే కోల్పోవడం ఆశ్చర్యం. ఒక ఇష్యూమీద వ్యాఖ్యానించడం లేదు. మంచి చెడు మాట్లాడం లేదు. మొత్తంగా మోడు  వారిపోయాడు. చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడం కూడా ఆయనకు శాపమయిపోయిందని దీని వల్ల అర్థమవుతుంది.  ఎంతో కాలం  కొనసాగాల్సిన రాజకీయ  యాత్ర ఇలా అర్థాంతరంగా ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లడానికి కూడా నామోషి. జగన్ ను కలుద్దామా అంటే, జగన్ చాలా చిన్నవాడు.తనేమో మాజీ ముఖ్యమంత్రి. చందబాబును కలుద్దామా అంటే- ఒకటి, ఆయన రైవల్; రెండు, తాను మాజీ ముఖ్యమంత్రి. ఆయన మామూలు మాజీ ఎమ్మెల్యే అయితే, ఎక్కడో ఒక చోట కాసింతా జాగ దొరికేది. మాజీ ముఖ్యమంత్రులకు జాగా లివ్వడం జగన్ కు, చంద్రబాబు కూడా కష్టమే. బిజెపి ఇవ్వగలదు గాని, అక్కడేమో ప్రాబ్లమ్ వచ్చినట్లుంది. ఇపుడాయన మరొక పార్టీలో చేరి వాళ్లిచ్చేకండువా కోసం అక్కడ తలదించలేడు.

పోతే, జై సమైక్యాంధ్ర అనే పాత పార్టీ ని బయటకు లాగనూ లేడు, ఎందుకంటే అది రద్దయిన నోటు లాంటిది. కాంగ్రెస్ లోకి వెళ్దామా అంటే అక్కడ బతుకు దెరువు కష్టం. దివాకర్ రెడ్డి లాగా నోరున్న వాడు కాదు,ఫ్యాక్షన్ లీడర్ కాదు. అందువల్ల ఆయనను బొట్టు పెట్టి ఎవరూ పిలవడం లేదు. గొప్ప ఇన్ స్పైరింగ్ మాటకారా అంటే, ఆయన మాట్లాడే తెలుగే అర్థంకాదు. ఇక మిగిలిందేముంది. ఎపుడో రంజీ మ్యాచ్ అడాడని చెప్పుకోవాలి. రాజకీయాల్లో అలాంటివి ఫుట్ నోట్సే తప్ప క్వాలిఫికేషన్ లు కావు. ఆ విధంగా నల్లారి కిరణ్ కుమార్  కు చుట్టు ద్వారాలు మూసుకు పోయాయి. ముఖ్యమంత్రిగా మంచిపేరే తెచ్చుకున్నా, తెలుగు నాట ఇలా దయనీయంగా మాజీ అయిన ముఖ్యమంత్రి కిరణ్ ఒక్కరే. తెలుగుదేశం వాళ్లు బాగా బురద జల్లిన నాదెండ్ల భాస్కరరావు కూడా ధీమాగా పబ్లిక్ న తిరిగారు. చివరిదాకా తన నిర్ణయాలను సమర్థించుకున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అనే మాట తీసేస్తే ఆయన పరిపానలయోగ్యుడనే పేరుంది.  కాంగ్రెస్ లోకొచ్చి ఎంపి అయ్యారు.  కోట్లవిజయ్ భాస్కర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా దిగిపోయినా రాజకీయాలు మానేయలేదు. ఇలాగే ఇతర ముఖ్యమంత్రులు కూడా పదవులు పోయినా అజ్ఞాతంలోకి పారిపోలేదు.  ఒక్క కిరణ్ కుమార్ రెడ్డే ఇలా చేశాడు.

ఆయన రాజకీయజీవితం మళ్లీ వికసిస్తుందనే నమ్మకం సొంత తమ్ముళ్లకే లేనట్లుంది. కిరణ్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వెనక నుంచి చక్రం తిప్పిన సంతోష్ ఇపుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేతులు కలుపుతున్నారు. దీనికి అన్న ఆశీస్సులున్నాయని కొందరు చెబుతున్నారు. అకాలంగా ముఖ్యమంత్రి అయి తీవ్రంగా సఫర్ అవుతున్న తెలుగు రెడ్డి కిరణ్ ఒక్కడే. ఆయన కోలుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని కోరుకుందాం.

 

click me!