రాజధాని నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

First Published Nov 17, 2017, 12:54 PM IST
Highlights
  • అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్
  • పర్యావరణ పరంగా తొలగిన అడ్డంకులు
  • నిబంధనల ఆధారంగా నడుచుకోవాలన్న ఎన్జీటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్( ఎన్జీటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 22 నెలలపాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్జీటీ శుక్రవారం అనుమతి తెలిపింది. దీంతో రాజధాని నిర్మాణానికి పర్యావరణ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కాకపోతే.. కొండవీటి వాగు దిశ మార్చినా ముంపు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్, పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ రెండు కమిటీలు నెలకొకసారైనా సమావేశం కావాలని సూచించింది. అలాగే పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన 190 నిబంధనలను అమలు చేయాలని ట్యిబ్యూనల్ ఆదేశించింది.

 రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రాంతమంతా డెల్టా ప్రాంతం. అక్కడ సంవత్సరం పొడవునా పంటలు పండుతాయి. ముఖ్యంగా అరటి తోట, పూల తోటలు లాంటివి అనేకం ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే.. పర్యావరణానికి హాని కలుగుతుందని ఆరోపిస్తూ పి.శ్రీమన్నారాయణ, మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఎఎస్‌ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవలే వాదనలు ముగించిన ఎన్‌జీటీ తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే.  కాగా వాటిపై శుక్రవారం ఉదయం తుది తీర్పును వెలువరించింది.

click me!