మూసివేత దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌: ఇక తేల్చుకోవాల్సింది కేంద్రమే

By Arun Kumar PFirst Published Mar 16, 2019, 2:22 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ మూసివేత దశగా అడుగులేస్తున్నది. ప్రైవేట్ ప్రొవైడర్లతో పోటీ పడేందుకు వెసులుబాటు కల్పించకుండా సర్కార్ సవతి ప్రేమ ఒక వంతైతే.. నిధుల సమకూర్చేందుకు గానీ, పోటీ పడేందుకు అనుమతించక పోవడం మరో సమస్య. ప్రైవేట్ సంస్థలకు స్పెక్ట్రం చెల్లింపులకు వాయిదాల పద్దతిని అనుమతించిన కేంద్రం.. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆ అవకాశం ఇవ్వకపోవడమే అసలు సమస్యలకు కారణం. వాస్తవాలను కప్పిపెట్టి.. సంస్థ నష్టాల పాలవుతున్నదని, మొత్తం వేతన భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లకే ఖర్చు చేయాల్సి వస్తున్నదని నిర్ధారణకు వచ్చింది. తాజాగా కొటక్ ఇనిస్ట్యూషనల్ ఈక్విటీస్ అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు నిధులు సమకూర్చి నిలబెట్టడమా? మూసేయడమా? అన్న అంశాలను తేల్చుకోవాలని కేంద్రానికి కోటక్‌ ఈక్విటీస్‌ నివేదిక స్పష్టం చేసింది. 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ను మూసివేయడానికి రంగం సిద్ధమవుతున్నది. 1990వ దశకం వరకు దేశ ప్రజలందరికీ సేవలందించిన రారాజు ‘బీఎస్ఎన్ఎల్’ను ప్రైవేట్ ఆపరేటర్లు మార్కెట్లో ప్రవేశించిన తర్వాత దెబ్బతీసే యత్నాలు మొదలయ్యాయని వార్తలొచ్చాయి. ప్రైవేట్ టెలికం ప్రొవైడర్లకు స్పెక్ట్రం చెల్లింపులకు వాయిదాలు కల్పించిన సర్కార్.. బీఎస్ఎన్ఎల్ కు ఆ అవకాశం కల్పించనే లేదు. విధాన నిర్ణయాల్లోనూ అడ్డు పుల్లలే వేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. 

తాజాగా ‘మార్కెట్ సంచలనం’ జియో రంగ ప్రవేశం వల్ల బీఎస్ఎన్ఎల్ 
నష్టాలు డిసెంబర్‌ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా, వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి వన్‌ టైమ్‌ భారాన్ని భరించడమా అన్న దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక నివేదికలో తెలిపింది. 

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 1.76 లక్షల మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు తక్కువకో లేదా ఉచితంగానో స్పెక్ట్రం కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం తమకు 4జీ స్పెక్ట్రం బదులుగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ సమకూర్చమని కోరుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టొచ్చు’ అని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఈఈ) పేర్కొంది. 

చివరిసారిగా 2008 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లాభాలు నమోదు చేసిందని, నాటి నుంచి 2009–18 మధ్య మొత్తం రూ. 82,000 కోట్ల మేర నష్టాలు పేరుకుపోయాయని తెలిపింది. 2018 డిసెంబర్‌ నాటికి ఇది రూ. 90,000 కోట్లు దాటేసి ఉంటుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌  పేర్కొంది. 

2006లో నిర్వహణ ఆదాయాల్లో ఉద్యోగాల వ్యయాలు (రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కలిపి) 21 శాతంగా ఉంటే.. 2008 నాటికి 27 శాతానికి చేరాయి. చివరకు 2018 కల్లా ఇవి ఏకంగా 66 శాతానికి ఎగిశాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు ఏటా రూ. 7,100 కోట్ల మేర ఉంటున్నాయని అంచనా. టెలికం పరిశ్రమ పరిస్థితి టారిఫ్‌లు పెరగకపోతే మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఉద్యోగులందరికీ ఫిబ్రవరి నెల వేతన బకాయిలను పూర్తిగా చెల్లించేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇందుకోసం రూ. 850 కోట్ల అంతర్గత నిధుల్లో కొంత భాగాన్ని వినియోగించినట్లు పేర్కొన్నారు.  

కాగా కొత్త కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు తమ వింగ్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 30 రోజుల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్, ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌ కింద 30 రోజులు దేశీయంగా ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌ నంబర్ ఫోన్‌కు ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. విదేశాల నుంచైతే నిమిషానికి రూ. 1.2 చార్జీ ఉంటుంది. 

వింగ్స్‌ యాప్‌ వార్షిక యాక్టివేషన్‌ చార్జి రూ. 1,100 కాగా.. విద్యార్థులకు 20 శాతం, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 50 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు 75 శాతం డిస్కౌంటు ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వింగ్స్‌ (ఓఎస్‌డీ) ఏకే జైన్‌ తెలిపారు. ఉచిత ఆఫర్‌ గడువు ముగిశాక.. ల్యాండ్‌లైన్‌ లేదా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రకారం చార్జీలు ఉంటాయి.   

click me!