విశాఖలో  కన్యాశుల్కం నూట పాతికేళ్ల జాతీయ ఉత్సవాలు

First Published Jul 14, 2017, 6:46 PM IST
Highlights
  • గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన 125 ఏళ్లు పూర్తి
  • వచ్చే నెల 26, 27 తేదీల్లో విశాఖలో  కన్యాశుల్కం నూట పాతికేళ్ల జాతీయ ఉత్సవాలు
  • విశాఖ ఉత్సవాల గోడపత్రికను అమరావతిలో ఆవిష్కరించిన పరకాల ప్రభాకర్

అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 26, 27 తేదీల్లో నిర్వహించే  కన్యాశుల్కం నూట పాతికేళ్ల జాతీయ ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కానుంది. 1892లో తొలిసారి ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం సరిగ్గా ఈ ఏడాది 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. 


కన్యాశుల్కం ఉత్సవాలకు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తుండగా మొజాయిక్ సాహిత్య సంస్థ సమన్వయం చేయనుంది. ఇందుకు సంబంధించి గోడ పత్రికను శుక్రవారం సచివాలయంలోని ప్రభుత్వ సలహాదారు కార్యాలయంలో ఆవిష్కరించారు.  ఆవిష్కరణలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సమాచార శాఖ కమిషనర్ ఎస్. వెంకటేశ్వర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ భాస్కర్, మొజాయిక్ సాహిత్య సంస్థ ప్రధాన, సంయుక్త కార్యదర్శులు రామతీర్థ, జగద్ధాత్రి పాల్గొన్నారు. 
కన్యాశుల్కం జాతీయ ఉత్సవాల ప్రారంభానికి ముందురోజు ఆగస్టు 25న విజయనగరంలోని గురజాడ నివాసంలో రజత ఫలకం ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలు జరిగే రెండు రోజులు విశాఖపట్నంలో సదస్సును నిర్వహిస్తారు. సదస్సులో ఒడిషా, బెంగాల్, అసోం నుంచి వక్తలు ఆయా భాషల్లో ‘కన్యాశుల్కం’ సమకాలీన రచనలపై ప్రసంగిస్తారు. తెలుగు సాహితీప్రముఖులతో కలిసి ఒకే వేదికను పంచుకుంటారు. 


స్తీవిద్య ఆవశ్యకతను వివరిస్తూ, బాల్యవివాహాలను నిరసిస్తూ గురజాడ తన పదునైన కలాన్ని ఆనాడే ఎక్కుపెట్టారు. అప్పటి సాంఘిక దురాచారాలను తరిమికొట్టేందుకు రచనలనే ఆయుధంగా చేసుకుని నవ చైతన్యాన్ని తీసుకువచ్చారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆధునిక భారతీయ నాటకాల్లో తొలి నాటకం, రైతుల కడగండ్లను చిత్రిస్తూ దీనబంధు మిత్రా బెంగాలీలో రాసిన నీల్ దర్పణ్ కాగా, మన దేశంలో రెండో ఆధునిక నాటకం కన్యాశుల్కం కావడం విశేషం. కన్యాశుల్కం దురాచారం పోయినా ఆ పేరుతో గురజాడ వారి  నాటకం మిగిలింది. భారతీయ నాటకరంగంలో ఇన్నేళ్లు మనుగడ సాధించిన, 125 ఏళ్లు చరిత్ర కలిగిన ఏకైన నాటకం కన్యాశుల్కం ఒక్కటే కావడం తెలుగువారిగా మనకు గర్వకారణం. 
సాధారణంగా తొమ్మిది గంటల నిడివి వుండే కన్యాశుల్కం నాటక రూపకాన్ని మూడున్నర గంటలకు సంక్షిప్తం చేసి తొలిసారిగా విశాఖ వుడా ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. కన్యాశుల్కం సావనీర్‌ను ప్రచురిస్తారు. అలాగే లఘు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సాహిత్య, నాటకరంగ కృషీవలురకు గౌరవ సన్మానాలు చేస్తారు.

click me!