ఆంధ్రాలో కొరియా బూసాన్ తరహా సిటీ

First Published Nov 9, 2017, 6:38 PM IST
Highlights
  • వేరుపడిన స్వల్పకాలంలోనే దక్షిణ కొరియా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
  • ఆ  స్ఫూర్తితో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడుస్తున్నది

దక్షిణ కొరియాలోని బూసాన్ (పైఫోటో) తరహాలో ఏపీలో కొరియన్ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏపీని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ పెద్దసంఖ్యలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువస్తే ప్రభుత్వపరంగా అన్నివిధాలా ప్రోత్సాహం కల్పిస్తామని కొరియా ఇన్వెస్టర్లకు హామీఇచ్చారు. 30 కంపెనీలతో కూడిన కొరియా ప్రతినిధుల బృందం గురువారం మధ్యాహ్నం వెలగపూడి  సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ ప్రతిపాదనలపై చర్చించింది. 

 

 

 

 

 

 

 

 

 

దక్షిణ కొరియాతో ఏపీకి అనేక అంశాలలో సామీప్యం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. జనాభా, విస్తీర్ణంలో రెండూ సమానంగానే ఉన్నాయని, అక్కడ ఉన్నట్టే ఇక్కడా సుదీర్ఘ తీరప్రాంతం ఉందని చెప్పారు. దక్షిణ కొరియా వేరుపడి స్వల్పకాలంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉన్నదని అన్నారు. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను గమనించి ఇప్పటికే పలు కొరియన్ కంపెనీలు ముందుకొచ్చాయని, ఇదేవిధంగా బూసన్‌లో ఉన్న మొత్తం 3వేల కంపెనీలు వచ్చినా అందరికీ ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమరావతితో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని అనుకూలతలు ఉన్న మరో ప్రాంతంలో గానీ కొరియన్ సిటీ ఏర్పాటు చేస్తామని, డిజైన్, ఇతర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలతో వస్తే ఈ సిటీ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు చేసుకుందామని ముఖ్యమంత్రి ఈ బృందానికి చెప్పారు. నిర్దిష్ట ప్రతిపాదనలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారందరికీ సత్వర అనుమతులిచ్చి తగిన సహకారం అందిస్తామని హామీఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనుమతులు సులభంగా అందించడమే కాకుండా, భూములు, నీరు, నిరంతర విద్యుత్, ఇతర రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. 


దక్షిణ కొరియాకు చెందిన చిన్నకార్ల దిగ్గజ సంస్థ కియా అనంతపురములో ఏర్పాటుచేసే ప్లాంటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటం, దానికి అనుబంధంగా మరో 39 అనుబంధ సంస్థలు ముందుకు రావడం చూసి అదే బాటలోనే అక్కడి మరికొన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి సాలమన్ ఆరోఖ్యరాజ్ తొలుత ముఖ్యమంత్రికి వివరించారు.  దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పర్యటించిన ఈ బృందం ఏపీలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసిందని చెప్పారు. భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని సంతృప్తి చెందినట్టు తెలిపారు. 
ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణరంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఏపీలో ఓడరేవుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి అంశాలలో తమకు సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్‌ను కోరారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్దార్ధజైన్  పాల్గొన్నారు.

click me!