
జగన్ పై, ఆయన పాదయాత్రపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైసీపీ నేత జోగి రమేష్ విరుచుకుపడ్డారు. ‘‘ప్యారడైజ్ పేపర్లలో జగన్ పై వచ్చిన వార్తలపై పలువురు మంత్రులు, నేతలు స్పందించారు.. వారంతా వాటిని నిజమని నిరూపించగలరా?’’ అంటూ ప్రశ్నించారు.ఈ ప్యారడైజ్ పేపర్ల విషయంలో.. జగన్ చంద్రబాబుకి బహిరంగంగా సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఆ సవాల్ స్వీకరించే ధైర్యం టీడీపీ నేతల్లో ఉందా అంటూ ప్రశ్నించారు.
టీడీపీ నేతలకు రాజకీయ విలువలు ఉంటే.. జగన్ విసిరిన సవాల్ స్వీకరించాలన్నారు. సవాలు స్వీకరించలేని దమ్ము, ధైర్యం లేకపోతే.. బహిరంగంగా తమ అధినేతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క నేతకు కూడా నైతిక విలువలు లేవని విమర్శించారు. రాష్ట్ర పరువును దిగజార్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేని వాళ్లు మంత్రులుగా ఉండటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాజ్యాంగ విలువలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు దిగజార్చుతూ ఫిరాయింపు ఎమ్మెల్యలేను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.