
తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) పాలక మండలి ఛెయిర్మన్ పదవికి ఎవరిని నియమించాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ చిక్కు సమస్య ఎదుర్కొంటున్నది. మాజీ రాజ్యసభ సభ్యుడు,ముఖ్యమంత్రి బావ నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. ఈ మేరకు హరికృష్ణకు సమాచారం కూడా పంపించారని తెలిసింది. అయితే, హరికృష్ణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. హరికృష్ణ స్పందన ఏమిటో చూశాక మరొక పేరును పరిశీలించాలనుకుంటున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ఏషియానెట్ కు చెప్పారు.
చదలవాడ కృష్ణ మూర్తి పదవీకాలం పూర్తయ్యాక, ఈ పదవి ఖాళీ అయింది.
ఈ మధ్య హరికృష్ణ తెలుగుదేశం వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మొన్న వైజాగ్ లోజరిగిన మహానాడుకు కూడా ఆయన హాజరు కాలేదు. అయితే, చంద్రబాబు నాయుడు హరికృష్ణకు దగ్గరవ్వాలని చూస్తున్నారని,అందులో భాగంగానే ఇపుడు బావకు టిడిపి ఛెయిర్మన్ పోస్టు కానుకగా ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది.
హరికృష్ణ , చంద్రబాబునాయుడుల మధ్య సంబంధాలంత బాగాలేవు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి రెండుకుటుంబాలు దగ్గిర కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే, 2019 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం అవసరం కావచ్చు. అందువల్ల హరికృష్ణను లైన్లో పెట్టుకునేందుకు ప్రతిష్టాత్మకమయిన టిటిడి ట్రస్టు బోర్డు ఛెయిర్మన్ పోస్టు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆయన వద్దంటే, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి లేదా రాజమండ్రి ఎంపి మురళీమోహన్ లేదా మరొక నాయకుడి పేరును పరశీలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.