హైదరాబాద్ లో సినారే స్మారక మందిరం

First Published Jun 13, 2017, 2:19 PM IST
Highlights

 మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి పార్థివదేహానికి తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం నివాళులు అర్పించారు. సినారె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సినారెతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో  సినారె స్మారక మందిరం ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు.

జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సి.నారాయణరెడ్డికి తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. సినారె నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.సినారే గదిని పరిశీలించారు. సినారెతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.

సినారె గదిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నారు-

 ‘‘కవులకు గ్లామర్‌ తెచ్చిన మహానుభావుడు సినారె. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఆది, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పిన మహాకవి. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి.’’

సినారే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేవారి కోసం జిల్లా కేంద్రాల నుంచి 100 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో  సినారె పేరిట స్మారక ప్రదర్శన శాల సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామని,దీనికి తొందర్లోనే జాగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

 ‘‘తెలంగాణలోని ఒక  సంస్థకు సినారె పేరు పెడతాం. ట్యాంక్‌బండ్‌తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఆయన స్వగ్రామాలలో మహాకవి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.’ ఆయన ప్రకటించారు.

కెసిఆర్ వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు ఉన్నారు. సినారె అంత్యక్రియలు అధికార లాంఛనాలతో బుధవారం జరగనున్నాయి.

click me!