మొత్తం జల్లికట్టే చేసింది..!

First Published Feb 5, 2017, 2:03 PM IST
Highlights

తమిళుల ఆత్మగౌరవప్రతీకగా మారిన జల్లికట్టు కోసం ఢిల్లీ కి వెళ్లి గెలిచిన పన్నీరు సెల్వం తన పార్టీ  చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయారు. విశ్వాసంగా పనిచేసినందుకు మూల్యం చెల్లించుకున్నారు.

 

జల్లికట్టును గెలిపించి తాను మాత్రం ఓడిపోయాడు తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. జయలలితకు వీర వీధేయుడిగా పేరుతెచ్చుకున్న సెల్వం... అమ్మ మృతి తర్వాత ఊహించని రీతిలో సీఎం అయ్యారు. జయలలిత భక్తుడిగా తమిళనాట మంచి పేరే తెచ్చుకున్నారు.

 

తన కంటూ సొంత ఇమేజ్ ఏ మాత్రం లేకున్నా అమ్మ పేరుతో పార్టీకి మచ్చతేకుండా బాగానే బండి నడిపారు. కానీ, జయలలిత మృతి అనంతరం జరిగిన పరిణామాల వల్ల చివరకు తనకు తానే  శశికళకు పదవిని అప్పగించాల్సి వచ్చింది.

 

అమ్మకు, చిన్నమ్మకు విశ్వాసపాత్రుడిగా ఉన్న పన్నీరు స్వయంగా ఎందుకు పదవి దిగాల్సి వచ్చింది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని  శశికళ వైపే కెబినెట్ అంతా ఎందుకు నిలిచింది.  జయలలిత మరణించిన కరెక్టుగా 2 నెలల్లోనే ఇన్ని నాటకీయపరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి.

 

జయకు విశ్వాసంగా  ఉన్నట్లుగానే శశికళకు కూడా పన్నీర్‌ సెల్వం అత్యంత విశ్వసనీయంగా ఉండేందుకే ప్రయత్నించారు.పార్టీని చీల్చాలని ఆలోచన చేయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి సంకేతాలు అందినా ఏ మాత్రం స్పందించలేదు. అయితే విశ్వాసంగా ఉండటమే ఆయన పదవికి ఎసరు పెట్టింది.

 

అంతేకాదు తన మంత్రి వర్గంలోవారిని ఆకట్టుకోవడం, ప్రజలను తన వైపునకు తిప్పుకోవడం వంటి చర్యలు చేపట్టక పోవడంతో ఆయన తాత్కాలిక సీఎం అనే భ్రమ ప్రజల్లోనూ వచ్చేసింది.

 

ఇదే శశికళకు ఆయుధంగా మారింది. దీనికి తోడు జల్లికట్టు నిషేధం కూడా ఆమెకు అందివచ్చిన వరంగా మారిందన్నది తమిళనాట రాజకీయ విశ్లేషకుల మాట.

 

జల్లికట్టు నిషేధంపై యావత్తు తమిళప్రజలు ఏకమయ్యారు. పార్టీలన్నీ కలసి నిషేధానికి వ్యతిరేకంగా పోరాడాయి. పన్నీరు సెల్వం సీఎంగా మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయి జల్లికట్టు నిషేధంపై ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు.

 

కానీ, పన్నీరు అలా ఢిల్లీ నేతలకు మోకరిల్లడమే తమిళ ప్రజలకు నచ్చకుండా పోయింది. పన్నీరు స్థానంలో జయ ఉంటే ఢిల్లీ ముందు బానిసలా ప్రాధేయపడేవారు కాదని తమిళుల ఆత్మగౌరవం కాపాడేలా పోరాడేవారని వారి అభిప్రాయం.

 

అయితే, శశికళే.. పన్నీరును వ్యూహాత్మకంగా ఢిల్లీకి పంపించి ప్రజల నుంచి ఆయనకు  వ్యతిరేకత వచ్చేలా చేసిందని తెలుస్తోంది.

 

పార్టీలో అందరూ తన విధేయులే, ఇప్పుడు జల్లికట్టు  మూలంగా ప్రజల నుంచి కూడా పన్నీరుకు వ్యతిరేకత వచ్చే... ఇంకేముంది సీఎం పదవి చిన్నమ్మకు లాంఛనమైంది.

 

అయితే ఈ రెండు నెలల్లో ఎక్కడా కూడా శశికళ తన అంతరంగాన్ని బయటపెట్టకుండా వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది.

click me!