సచివాలయంలో వార్ మొదలైంది..!

First Published Nov 3, 2017, 1:48 PM IST
Highlights
  • ఏపీ సచివాలయంలో ఎన్నికల వాతావరణం
  • ఒక నేత అధికార పార్టీకి మద్దతుగా నిలిస్తే.. మరొక నేత.. ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచాడు.
  • వీరిద్దరి మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు.

2019 ఎన్నికలు మొదలవ్వడానికి ఇంకా చాలా సమయమే ఉంది. కానీ  ఆ ఎన్నికల ప్రభావం మాత్రం.. ఏపీ సచివాలయంలో స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే అక్కడ వార్ మొదలైంది. ఉద్యోగ సంఘాల నేతలు.. రెండు వర్గాలుగా వీడిపోయి.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక నేత అధికార పార్టీకి మద్దతుగా నిలిస్తే.. మరొక నేత.. ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు.

అసలు సంగతేంటంటే.. మూడు నెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని ప్రభుత్వం 50ఏళ్లకు కుదిస్తోందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అంతేకాకుండా ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా మొదలైంది. కావాలనే ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో... దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అలాంటి ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే వంత పాడారు.  దీంతో.. పరిస్థితి సద్దుమణిగిందని అందరూ భావించారు.

అయితే.. తాజాగా.. ఆ వయోపరిమితి కుదింపు సంబంధించిన జీవో కాపీని లీక్ చేశారంటూ.. ప్రభుత్వం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మొన్నటిదాకా.. అలాంటి జీవో అనేదే లేదని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అదే జీవో కాపీ లీక్ చేశారని చెప్పడం ఉద్యోగులను గందరగోళానికి గురి చేసింది. అంతేకాకుండా  ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇద్దరు ఎస్‌.ఓలను సస్పెండ్‌ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో ఉద్యోగ సంఘాల అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ.. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం కొందరు ఉద్యోగులకు నచ్చడం లేదు. దీంతో.. ఆయన మద్దతుదారులంతా  ఒక వర్గం, ఆయన వ్యతిరేకులంతా మరో వర్గంగా చీలిపోయారు. ఉద్యోగ సంఘ అసోసియేషన్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన  వెంకటరమణా రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. ఈ రెండు వర్గాలు ఒకరినొకరు బహిరంగంగానే విమర్శిచుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

click me!