ఎన్టీఆర్ మీద బాలయ్య సినిమా...

First Published Feb 6, 2017, 8:36 AM IST
Highlights

ఎన్టీ ఆర్ జీవితంలో టిడిపి ప్రస్తుత నాయకత్వానికి ఇబ్బందికరమయిన అంశాలుచాలా ఉన్నాయి. లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ వివాహం, చంద్రబాబుకు వెన్నుపోటు అపకీర్తి రావడం ఇందులో ముఖ్యమయినవి. వీటిని ఎలా చిత్రీకరిస్తారో చూడాలి. 

ఆంధ్రదేశంలో తెలుగుజాతి సెంటిమెంట్ తెచ్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేసిన  నందమూరి బాలకృష్ణ  ఇపుడు ఇదేబాటలో మరొక ప్రయత్నం చేస్తున్నారు.

 

తెలంగాణా సెంటిమెంటులాగా ఆంధ్రలో తెలుగు సెంటిమెంటు ఉప్పొగించలేక పోయినా, ఆయన నటించిన ’గౌతమీ పుత్ర శాతకర్ణి‘ కాసుల వర్షం బాగానే కురిపించింది.  తెలుగోళ్లంతా  తెలుగుదనంతోఉప్పొంగి ఇపుడు సాగుతున్న ఆంధ్రదేశనవ నిర్మాణానికి వెల్లువలా ఇప్పటి చక్రవర్తికి మద్దతు చూపాలన్నది ఆ సినిమాలో దాగి ఉన్న రహస్యం.  

 

తెలుగోళ్లంతాచూడాల్సిన సినిమా అని  ఎన్నిరకాల ప్రచారం చేసినా  తెలుగు ఆత్మగౌరవం పెరగ లేదు.  శాతకర్ణి సినిమా తీసిన వూపులో ఇపుడు బాలయ్య తండ్రి ఎన్టీఆర్ జీవితం మీద సినిమా తీయాలనుకుంటున్నారు.

 

అందులో ఎన్టీఆర్ పాత్రను  ఆయనే పోషిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు ఎన్టీ ఆర్ సొంతవూరు నిమ్మకూరు లో  వెల్లడించారు. నిమ్మకూరులో ,  అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ నాయుడితో కలసి ఆయన 30 పడకల ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదని ఇందులో అన్ని రకాల కోణాలుంటాయని ఆయన వెల్లడించారు.

 

ఎన్టీ ఆర్ జీవితంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత నాయకత్వానికి ఇబ్బందికరమయిన అంశాలుచాలా ఉన్నాయి. అవి లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ వివాహం, రెండోది ఆయన  పదవీచ్యుతిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.  ఈ రెండింటి మీద ప్రజల అభిప్రాయాలకు,  ప్రస్తుత తెలుగుదేశం నాయకత్వానికి  భిన్నాభిప్రాయలున్నాయి.

 

 ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి 1996 లో చంద్రబాబు  ముఖ్యమంత్రి కావడదాన్ని జనమంతా వెన్నుపోటుగా పిలుస్తారు. ఆ మచ్చపోగొట్టుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఇంకా చేస్తున్నారు. ఎన్టీఆర్ జపం ఇందులో భాగమే నని చెబుతారు.  ఇలాంటిదే మరొక ఇబ్బందికరమయిన విషయం రెండో పెళ్లి వ్యవహారం.

 

రెండో పెళ్లి వ్యవహారం దాచేందుకు ప్రయివేటు వ్యవహారం కాదు. ఈ వ్యవహారం చివరకు ఆయన చావుకు దారి తీసింది.  రెండోభార్య అయిన లక్ష్మీ పార్వతిని, ఎన్టీఆర్ మీద చంద్రబాబు నాయకత్వంలో తిరుగుబాటును ఎలా  చూపిస్తారో చూడాలి.

 

బహుశా, చంద్రబాబుది వెన్నుపోటు కాదని నిరూపించే ప్రయత్నం చేయవచ్చు. లక్ష్మీ పార్వతి కథకి అభ్యంతరం చెప్ప వచ్చు. మొత్తానికి బాలయ్య నిర్ణయం పెద్ద రాజీకీయ చర్చను రెకెత్తించే అవకాశం ఉంది. ఇది కేవలం ఎన్టీఆర్ మీద వస్తున్న బయోపిక్ కాకుండా ఏదో రాజకీయ ఉద్దేశంతోనే తీస్తున్న చిత్రమనిపిస్తుంది. 2019 ఎన్నికల వాతావరణ ఏర్పడేముందుకు ఈ చిత్రంతీయాలన్న ఆలోచన బాలయ్యకు వచ్చిందంటే యాదృచ్ఛికమవుతుందా?

click me!