గిట్టుబాటు తూటా! (ఒక ‘రైతు కవిత’)

First Published Jun 7, 2017, 1:11 PM IST
Highlights

గిట్టుబాటు ధర అడగడం కూడా నేరమయిన కాలంలో నేలకొరిగిన రైతుకొక  నివాళి

 

 

 

గిట్టుబాటు తూటా!

_______

 

ఒంటి సత్తువంతా
గింజకు అందించి
పంటను మొలిపించినందుకు


వాడప్పుడు
కాల్దరిలో కాల్పులు జరిపిండు

మోన్ సాంటోకు
 మోకాళ్ల మీద వంగి
గర్భవిచ్ఛిత్తి విత్తులు
రైతు మొఖాన జల్లిండు...

పన్ను పిడిగులు కురిపించిన
చావు దెబ్బలు మామూలే...

వీడిప్పుడు....
హిందువులంతా బంధువులని
కడుపున విషంతో కౌగలించుకు
వీపున కత్తులు దించి
రాబందుల తో వియ్యమందిండు...

ట్రంపు కంపు మూతినాకి 
మతవిష విత్తుల్ని ఎగజల్లి
మనుషుల్ని విభజించి 
గంగా సింధు మైదానాల్లో
గుడి మెట్ల మీద కొబ్బరి పెంకుల్ని
పగల గొట్టినట్లు....
మనుషుల తలలతో
రక్త రాజకీయ క్రీడలాడినోడికి

బొట్టు బొట్టు స్వేదం రాల్చి
దేశానికి తిండి గింజైన మనిషి
ప్రాణం కూడా ఏం లెక్క?

వాడి లెక్క వేరు
గద్దె మీద కూర్చున్నదే లెక్క!

రాలిన తలలు
తెగి పడిన మొండాలు
వాడి రాజకీయ చిత్రపటంలో
మైలురాళ్లు....

వాడి మైలేజి
దేశాన్ని చీల్చి
బాబ్రీని కూల్చి
కాశ్మీరును కాల్చి
దడకారణ్యాన్ని హంట్ చేస్తోంది...

వ్యవసాయం దండుగ
బహుళ జాతి 
మూతి నాకుడే పండుగ

గిట్టుబాటు ధర
అడిగినందుకు
తూటాలే సమాధానం!

వ్యవసాయిక విప్లవం
ఆదర్శమైనందుకు
ఆపరేషన్ గ్రీన్ హంటే సమాధానం...


'రైతు రాజ్యం'
ఊకదంపుడుగాళ్లకి
రైతు పిడికిలి
ఇవ్వదా సమాధానం?

-బాసిత్.

 

 

(బాసిత్ ఒక తెలంగాణా కవి. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లా పార్శ్వనాథ్‌ ప్రాంతంలో  మంగళవారం నాడు గిట్టుబాటు ధరల కోసం,రుణ మాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతుల మీద   పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు రైతులు నెలకొరిగారని వార్త చదివాక... ఆయన స్పందన ఇది) 

click me!