
కొందరు సమాజంలోని అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తారు. అందరిలా కాకుండా కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో క్షమా బిందు ఒకరు. గుజరాత్ కు చెందిన ఈ మహిళ గత ఏడాది తనని తానే వివాహం చేసుకొని వార్తలో నిలిచింది. ఇప్పుడు తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొని మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. తన పెళ్లి జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో బిందు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకున్నారు.
తన మొదటి యానివర్సరీ సందర్భంగా బిందు గత ఏడాది నుంచి తన ప్రత్యేకమైన రోజు వరకు స్నిప్పెట్లతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోలో ఆమె 'ఎక్లా చలో రే' అని రాసి ఉన్న టాటూను కూడా చూపించారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బెంగాలీ కవిత నుంచి ఈ పదాలను ఆమె స్వీకరించారు. ఒంటరిగా నడవండి అని దాని అర్థం. ఈ వార్షికోత్సవ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి పలువురు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు 'కంగ్రాట్స్' అని చెబుతున్నారు. కొందరైతే 'అద్భుతం', 'గ్రేట్' అన్నారు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,500 వ్యూస్, 1,000 లైక్స్ వచ్చాయి.
బిందు భారతదేశపు మొట్టమొదటి స్వయం ప్రకటిత సోలగామిస్ట్. 24 ఏళ్ల వయసులోనే తనను తాను పెళ్లి చేసుకుంది. సన్నిహితులు, సహోద్యోగులతో కలిసి తన ఇంట్లోనే వివాహ వేడుక జరుపుకున్నారు. తన ప్రత్యేకమైన రోజున బిందు చాలా మంది హిందూ వధువుల్లా ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోయింది. ఆమె ఆభరణాలలో చొక్కా, చెవిపోగులు, మాంగ్ టిక్కా మొదలైనవి కనిపించాయి. హిందూ సంప్రదాయాలను అనుసరించి ఆమె.. వినాయకుడు, లక్ష్మీదేవికి పూజలు చేసింది. దీంతో పాటు ఆమె తనపై తాను పూలదండ వేసుకుని నుదుటిపై కుంకుమ పెట్టుకుంది.
విషాదం.. తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 85 ఏళ్ల వృద్ధుడు మృతి..
మరో నగరంలో నివసిస్తున్న తన తల్లి ఈ వివాహానికి సపోర్ట్ గా నిలిచారని ఆ సమయంలో బిందు వెల్లడించారు. పెళ్లికి ముందు బిందుకు హల్దీ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. పెళ్లి, హల్దీ రెండింటి ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిందు వివాహం ఆ సమయంలో మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆమె నిర్ణయంపై సమాజం మిశ్రమంగా ప్రతిస్పందించింది.