
బెంగళూరు నగర పరిధిలోని దాసనపుర సమీప అంచేపాళ్యంలో ఈ ఘటన జరిగింది. భీమనామావాస్య సందర్భంగా భర్తకు పూజ చేసిన కొద్ది సేపటికే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇప్పుడీ సంఘటన సంచలనంగా మారింది.
మృతురాలు స్పందన (24)గా గుర్తించారు. 2024లో స్పందన, అభిషేక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పరిచయం బెంగళూరులో పీజీ చదువుతున్న సమయంలో ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ లీగల్‌గా పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత అంచేపాళ్యంలో నివసిస్తున్నారు.
పెళ్లి తర్వాత స్పందనకు భర్త అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ తరచూ వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని స్పందన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భీమనామావాస్య రోజున జూలై 24న భర్తకు పాదపూజ చేసిన తరువాత కొద్ది సేపటికే స్పందన ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల సమాచారం మేరకు స్పందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహಳ್ಳಿ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, భర్త అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మపై వరకట్న వేధింపులు, హత్య కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
తన కూతురును వరకట్న వేధింపులకు గురి చేశారని స్పందన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు.