
స్వల్ప అస్వస్థతతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ అపోలో ఆసుపత్రిలో చేరారు. హృదయ స్పందనలో తేడాలు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం బాగుందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
జూలై 21న ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో స్టాలిన్‌కు తల తిరిగినట్లైంది. వెంటనే ఆయనను పరీక్షల కోసం అపోలో ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజుల తర్వాత స్టాలిన్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్య బులెటిన్ విడుదల చేసింది.
వైద్య బులెటిన్‌లో, తల తిరుగుడు కారణం కనుగొనడానికి పలు పరీక్షలు నిర్వహించామని, హృదయస్పందనలో తేడాలు ఉండటమే కారణమని తెలిసిందని పేర్కొన్నారు. గుండె సంబంధిత వైద్యులు డా. జి. చెంకుట్టువేలు నేతృత్వంలోని బృందం సలహా మేరకు స్టాలిన్ ఈరోజు ఉదయం అపోలోలో చేశారు. బుధవారం చేసిన యాంజియోగ్రామ్ నార్మల్‌గా ఉందని ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం బాగుందని తెలిపారు. మరో రెండు రోజుల్లో సాధారణ పనులను తిరిగి ప్రారంభిస్తారని వైద్యులు వెల్లడించారు.